Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్… టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ మారడం గురించే. రెండురోజులపాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేయడంతో ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై పుకార్లు గుప్పుమన్నాయి. రేవంత్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని వార్తలొచ్చాయి. కాంగ్రెస్ లో చేరడానికి రేవంత్ పలు డిమాండ్లు విధించినట్టు కూడా తెలుస్తోంది. టీడీపీలో లానే కాంగ్రెస్ లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు 15 ఎమ్మెల్యే సీట్లు రేవంత్ కోరినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ డిమాండ్లకు రాహుల్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించే ముందే… రేవంత్ రెడ్డి టీడీపీని వీడతారని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త రాష్ట్రంలో టీడీపీని అన్నింటా తానై నడిపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికి నామమాత్రమేమో కానీ, రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో టీఆర్ ఎస్ కు దీటుగా నిలిచిన పార్టీ టీడీపీనే. అసెంబ్లీలోనూ, బయటా..టీఆర్ ఎస్ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగడుతూ రేవంత్ రెడ్డి… కేసీఆర్ కు సమఉజ్జీగా నిలిచారు. అయితే కేసీఆర్ ఒక్కొక్కరిగా టీడీపీ నేతలను పార్టీలోకి ఆకర్షించడంతో క్రమక్రమంగా రాష్ట్రంలో టీడీపీ బలం తగ్గిపోయింది. ఎర్రబెల్లి వంటి పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డితో విభేదించి… గులాబీ కండువా కప్పుకున్నారు. అయినా సరే రేవంత్ రెడ్డి చెక్కుచెదరలేదు. టీఆర్ఎస్ ను ఊపిరితీసుకోనీకుండా ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.
దీంతో సమయం కోసం వేచిచూసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఓటుకు నోటు అస్త్రం సంధించారు. ఈ తిరుగులేని దెబ్బతో టీడీపీ ఒక్కసారిగా కుప్పకూలింది. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం, ఓటుకు నోటు కేసు జాతీయస్థాయిలో సంచలనం సృష్టించడం, చంద్రబాబుపై నలుమూలల నుంచి విమర్శలు వెల్లువెత్తడం వంటి పరిణామాలు తెలంగాణలో టీడీపీని దారుణంగా దెబ్బతీశాయి. తర్వాతి రోజుల్లో రాజకీయాల్లో అనేక మార్పులు జరిగి చంద్రబాబు, కేసీఆర్ కలిసిపోయినప్పటికీ… రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ ఎస్ కు ఆమడ దూరంలోనే ఉంటున్నారు. నేతల వలసలతో తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం సంగతి అటుంచి, అసలు ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరుకుతారా అనే సందేహం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో టీఆర్ఎస్, టీడీపీ పొత్తు అంశంపై తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు టీఆర్ ఎస్, టీడీపీ కలిసిపోటీచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది టీఆర్ ఎస్ ను ఎంతగానో వ్యతిరేకించే రేవంత్ రెడ్డికి మింగుడు పడని పరిణామం. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉండడం, తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు అధిష్టానం వైపు నుంచి చర్యలు లేకపోవడంతో రేవంత్ రెడ్డి తనదారి తాను చూసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది కాంగ్రెస్ ఒక్కటే. అందుకే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారు. రేవంత్ పార్టీ వీడనున్న విషయం చంద్రబాబుకు ఎప్పుడో తెలుసన్న ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ భవిష్యత్ ఏమిటన్నది అగమ్యగోచరంగా మారిన స్థితిలో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వలేక చంద్రబాబు… ఈ విషయంపై మౌనం వహించారని సమాచారం. తెలంగాణలో పార్టీ మారిన ఇతర టీడీపీ నేతలతో రేవంత్ రెడ్డిని పోల్చలేం. ఎందుకంటే..కేసీఆర్ ఎరవేసిన పదవుల కోసం ఇతర నేతలు టీడీపీని వీడితే…రేవంత్ మాత్రం కేసీఆర్ పై పోరాడేందుకు ఓ వేదిక కోసమే… పార్టీ మారుతున్నారు. రేవంత్ చేరికతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ …తెలంగాణలో టీఆర్ ఎస్ కు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగనుంది.