కేసీఆర్ ఉసిగొల్పిన జంతువు నాపై ఆరోపణలు చేస్తోంది…!

Revanth Reddy Open Challenge To CM KCR Over IT Raids

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. రేవంత్ అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని, దాదాపు 18 డొల్ల కంపెనీల ద్వారా వందల కోట్లను దేశం దాటించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని తన ఇంటిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై వచ్చిన పలు ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.

revanth
ఐటీ దాడుల సందర్భంగా కొందరు టీఆర్ఎస్ నేతలు తన మామయ్య పద్మనాభరెడ్డితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారన్నారు. వారంతా తనకు బినామీగా ఉన్నట్లు చెప్పడం పై రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. సదరు నేతకు బినామీ ఆస్తులంటే అర్థమే తెలియదని వ్యాఖ్యానించారు. తనకు పిల్లనిచ్చిన మామ పద్మనాభరెడ్డి అప్పట్లోనే ఆల్ ఇండియా కిరోసిన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడని తెలిపారు. ఇక తన కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు, ఓ సోదరి ఉన్నారని ఇంతమంది ఇంట్లో ఉంటే మరొకరి పేరుపై బినామీ ఆస్తులను పెట్టాల్సిన అగత్యం ఏముందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ రౌడీ షీటర్ చేత తనపై తప్పుడు ఆరోపణలు చేయించారని మండిపడ్డారు. కేసీఆర్ కంచంలో మిగిలిపోయిన దాన్ని తినే వెధవలు కూడా తనను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతీకార రాజకీయాలు ఎన్నటికీ మంచిది కాదన్న రేవంత్.. తాను ఎలాంటి మనీలాండరింగ్ కు పాల్పడలేదని స్పష్టం చేశారు.

revanth-reddy-speech

బంజారాహిల్స్ లోని తన నాలుగు అంతస్తుల భవనం నుంచి అవినీతికి పాల్పడినట్లు కొందరు ఆరోపించడంపై రేవంత్ సీరియస్ గా స్పందించారు. తాను 18 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి భారీగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపించడంపై మాట్లాడుతూ.. బంజారాహిల్స్ లోని ఇంటిని 22 ఏళ్లుగా కంపెనీలకు లీజుకు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ చాలా కంపెనీలు ఆ బిల్డింగ్ ను లీజుకు తీసుకున్నాయని వెల్లడించారు.

revanth-arrest
అలాగే తాను తొలిసారి 2007లో శాసన మండలికి ఎన్నికయ్యాయని రేవంత్ తెలిపారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆస్తుల కొన్న విలువను ప్రకటించానని వెల్లడించారు. అప్పుడు ఆస్తుల విలువ రూ. 2-3 కోట్లుగా ఉందన్నారు. 2014 నాటికి ఎన్నికల సంఘం ఆస్తుల మార్కెట్ విలువను ప్రకటించాలని సూచించిందని పేర్కొన్నారు. దీంతో తన ఆస్తుల విలువ ఒక్కసారిగా రూ.12-14 కోట్లకు చేరుకుందన్నారు. అలాగే ‘నేను తెలంగాణలో పర్యటించకుండా అడ్డుకోవడానికే మోదీ, కేసీఆర్ కుట్ర చేసి నాపై కేసులు పెడుతున్నారు. లోపల ఉన్న అధికారులకు ప్రతి రెండు నిమిషాలకోసారి ఫోన్లో ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారికి డైరెక్షన్ ఇస్తోంది ఎవరనేది తేలాలి’ అని రేవంత్ డిమాండ్ చేశారు. అలాగే ‘టీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు మీ కుటుంబ సభ్యుల ఆస్తులెన్ని, ఇప్పుడున్న ఆస్తులెన్ని? సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడదాం. మీ కుటుంబంలో ప్రజా జీవితంలో ఉన్న నలుగురి ఆస్తులు, అప్పుల మీద విచారణ జరిపిద్దాం. 2007 నుంచి నేటి వరకు నా ఆస్తుల సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడదాం. కేసీఆర్‌కు ఇదే నా సవాల్. ఇద్దరం కలిసి మోదీకి లేఖ రాద్దాం. 24 గంటల సమయం ఇస్తున్నా. 24 గంటల్లోగా నువ్వు స్పందించకపోతే అవినీతి పరుడివని అర్థం అవుతుంద’ని రేవంత్ తెలంగాణ సీఎంకు సవాల్ చేశారు.