కాంగ్రెస్ కొత్త వ్యూహం…ఇద్ద‌రు చంద్రుల‌పై రేవంత్ అస్త్రం

Revanth reddy resigns to TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఊహించిన‌ట్టే జ‌రిగింది. తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. చంద్ర‌బాబుతో చ‌ర్చించేందుకు విజ‌య‌వాడ వ‌చ్చిన రేవంత్ రెడ్డి ఆయ‌న‌తో ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌పకుండానే పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌పై మీడియా సమావేశం నిర్వహించిన త‌రువాత‌… రేవంత్ రెడ్డితో చ‌ర్చించాల‌ని చంద్ర‌బాబు భావించారు. ఇదే విష‌యాన్ని రేవంత్ కు చెప్పారు. అయితే చంద్ర‌బాబు మీడియా స‌మావేశం ముగియ‌క‌ముందే మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన రేవంత్ పార్టీకి, పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తూ అధ్య‌క్షుడికి లేఖ రాశారు. పార్టీలో ప‌రిణామాలు త‌న‌ను చాలా ఇబ్బందిపెట్టాయ‌ని రేవంత్ రాజీనామా లేఖ‌లో ఆరోపించారు. పార్టీపైనా, చంద్ర‌బాబు పైనా త‌న‌కు చాలా గౌర‌వ‌ముంద‌ని, చంద్ర‌బాబు త‌న‌కు తండ్రి లాంటి వార‌ని రేవంత్ అన్నారు. తాను కేసీఆర్ పై పోరాటం చేస్తుంటే… పార్టీలోని ఇత‌ర నేత‌లు ఆయ‌న‌తో అంట‌కాగుతున్నార‌ని రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

కొడంగ‌ల్ లో కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన అనంత‌రం భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌పై ఓ నిర్ణ‌యానికి వ‌స్తాన‌ని రేవంత్ తెలిపారు. చంద్ర‌బాబు విదేశీప‌ర్య‌ట‌న‌కు వెళ్లే ముందు… ఒక్క‌సారిగా రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై మీడియాలో వార్త‌లొచ్చాయి. రేవంత్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న కాంగ్రెస్ లో చేరనున్నార‌ని వార్త‌లొచ్చాయి. ఈ వార్త‌లు తెలుగురాష్ట్రాల్లో క‌ల‌క‌లం సృష్టించాయి.ఈ నేప‌థ్యంలో విదేశీప‌ర్య‌ట‌న‌కు వెళ్తూ ఢిల్లీలో ఆగిన చంద్ర‌బాబుతో భేటీ అయ్యేందుకు రేవంత్ ప్ర‌య‌త్నించార‌ని, ఆయ‌న‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌డానికి ముఖ్య‌మంత్రి నిరాక‌రించార‌ని ఊహాగానాలు వెలువ‌డ్డాయి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన వెంట‌నే… రేవంత్… పార్టీ మారుతున్న సంకేతాలు ఇచ్చారు. టీడీపీ ఏపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. తాను తెలంగాణ‌లో కేసీఆర్ కు వ్య‌తిరేకంగా పోరాడుతుంటే… ఏపీ నేత‌లు ఆయ‌న ఇచ్చే కాంట్రాక్టులు తీసుకుంటూ… ఆయ‌న‌తో అంట‌కాగుతున్నార‌ని మీడియాతో నిర్వ‌హించిన ఇష్టాగోష్టిలో ఆరోప‌ణ‌లు చేశారు.

రేవంత్ వ్యాఖ్య‌లు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. రేవంత్ ఆరోప‌ణ‌ల‌పై ఏపీ నేత‌లు స్పందించ‌లేదు కానీ… తెలంగాణ టీడీపీ నేత‌లు మాత్రం తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఎల్. ర‌మ‌ణ, మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు, అర‌వింద్ కుమార్ గౌడ్ వంటి నేత‌లు బ‌హిరంగంగానే రేవంత్ పై విమ‌ర్శ‌ల‌కు దిగారు. చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చే లోగా… దీనిపై తాడో పేడో తేల్చాల‌ని భావించిన టీడీపీ నేత‌లు పొలిట్ బ్యూరో స‌మావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో జ‌రిగిన ఈ స‌మావేశానికి రేవంత్ హాజ‌రై అంద‌రికి షాకిచ్చారు. ఎవ‌రిగురించి చ‌ర్చించ‌డానికి మీటింగ్ ఏర్పాటుచేశారో ఆ వ్య‌క్తే స‌మావేశానికి రావ‌డంతో… టీటీడీపీ నేత‌ల‌కు మొద‌ట ఏంచేయాలో అర్దం కాలేదు. అయితే రేవంత్ ఢిల్లీ టూర్ పై ఆగ్ర‌హంతో ఉన్న టీడీపీ నేత‌లు దీనిపై సూటిగా వివ‌ర‌ణ కోరారు. వారికి స‌మాధానం చెప్పేందుకు నిరాక‌రించిన రేవంత్ చంద్ర‌బాబు నాయుడికే అన్ని విష‌యాలూ చెబుతాన‌ని స‌మావేశంలో మౌనంగా కూర్చుండిపోయారు. పొలిట్ బ్యూరో మీటింగ్ త‌ర్వాత టీటీడీపీ నేత‌లు రేవంత్ పై విమర్శ‌లు గుప్పించారు.

ఉన్న‌ప‌ళంగా ముఖ్య‌మంత్రి కావాలన్న‌ది రేవంత్ రెడ్డి కోరిక‌ని, ఆయ‌న వైఖ‌రి వ‌ల్లే తెలంగాణ‌లో టీడీపీ తీవ్రంగా దెబ్బ‌తింద‌ని ఆరోపించారు. సంచ‌ల‌నాత్మ‌క ఓటుకు నోటు కేసు బాధ్యుడు రేవంత్ రెడ్డే అని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఆ త‌రువాత రోజు నుంచి నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. రేవంత్ రెడ్డి స‌డెన్ గా సైలెంట్ అయ్యాడు. రేవంత్ తో చంద్ర‌బాబు ఫోన్ లో మాట్లాడార‌ని, పార్టీ వీడితే రేవంత్ కే న‌ష్ట‌మ‌ని హెచ్చ‌రించార‌ని, అందుకే రేవంత్ కాంగ్రెస్ లో చేరాల‌న్న నిర్ణ‌యాన్ని మార్చుకున్నార‌ని వార్త‌లొచ్చాయి. దీంతో ఈ వ్య‌వ‌హారం ఇంత‌టితో స‌ద్దుమ‌ణిగిన‌ట్టు క‌నిపించింది. రేవంత్ టీడీపీలోనే కొన‌సాగునున్నార‌ని అంతా భావించారు. అయితే… రేవంత్ తీరుపై అసంతృప్తిగా ఉన్న టీటీడీపీ నేత‌లు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దిపారు. రేవంత్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కొంద‌రు సూచించారు. ఈ నేప‌థ్యంలో విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన చంద్ర‌బాబు హైద‌రాబాద్ లో టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మావేశంలో రేవంత్ పై పార్టీ నేతలు అనేక ఫిర్యాదులుచేశారు. దీంతో ఈ అంశంపై విస్తృతంగా చ‌ర్చ‌జ‌రిపేందుకు విజ‌యవాడ రావాల‌ని ముఖ్యంమంత్రి ఆదేశించారు.

రేవంత్ రెడ్డితో పాటు ఎల్.ర‌మ‌ణ‌, మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు, అర‌వింద‌కుమార్ గౌడ్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. మీడియాస‌మావేశం ముగిసిన త‌ర్వాత రేవంత్ వ్య‌వ‌హారంపై చర్చించాల‌ని చంద్ర‌బాబు భావిస్తుండ‌గానే… అంద‌రికీ షాక్ ఇస్తూ… రేవంత్ రాజీనామా నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. వీలైనంత త్వ‌ర‌లోనే రేవంత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న‌ట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌క‌ముందే… రేవంత్ పార్టీలో చేర‌నున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో దీనికి మార్గం సుగ‌మం చేసుకున్న రేవంత్… అక్క‌డినుంచి వ‌చ్చిన త‌రువాత తెలంగాణ‌లో ప‌రిస్థితులు అనుకూలంగా మారేలా చేసుకున్నారు. పార్టీలోకి త‌న రాక‌ను వ్య‌తిరేకిస్తున్న ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌తో విడివిడిగా స‌మావేశ‌మయ్యారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్, డి.కె. అరుణ వంటి వారితో భేటీ అయి… స‌ర్దిచెప్పారు. అంత‌ర్గ‌త ప‌రిస్థితి ఎలా ఉన్నా… తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు బ‌య‌టికి మాత్రం రేవంత్ ను త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామ‌ని చెబుతున్నారు.

రాష్ట్రం విడిపోయిన ద‌గ్గ‌ర‌నుంచి టీటీడీపీని అంతా తానే అయి న‌డిపించిన రేవంత్ కు కాంగ్రెస్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి. మ‌రోవైపు టీడీపీని వీడిన రేవంత్ ఓటుకునోటు కేసులో అప్రూవ‌ర్ గా మారనున్నార‌ని పుకార్లు చెల‌రేగాయి. ఇద్ద‌రు చంద్రుల‌ను ఇర‌కాటంలో పెట్ట‌డానికి ఇదే స‌రైన విధాన‌మ‌ని రేవంత్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో తాను టీడీపీ కోసం జైలుశిక్ష అనుభ‌వించి కేసీఆర్ కు వ్య‌తిరేకంగా పోరాడుతోంటే… చంద్ర‌బాబు మాత్రం… కేసీఆర్ ను స్నేహ‌భావంతో చూడ‌డం రేవంత్ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని, ఇద్ద‌రు చంద్రుల మీద ఈ ర‌కంగా క‌క్ష్య తీర్చుకోవాల‌ని భావిస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అటు చంద్ర‌బాబును, ఇటు కేసీఆర్ ను ఇరుకున‌పెట్టే అవ‌కాశం ఉన్నందునే… రేవంత్ చేరిక‌పై తెలంగాణ నేత‌లు అభ్యంత‌రంచెప్ప‌డంలేద‌నే వాద‌న వినిపిస్తోంది. స‌రిగ్గా వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి టీఆర్ఎస్ పైనా, టీడీపీపైనా రేవంత్ అస్త్రాన్ని ప్ర‌యోగించి రెండు రాష్ట్రాల్లో ల‌బ్దిపొందాల‌న్న‌ది రాహుల్ గాంధీ మాస్ట‌ర్ ప్లాన్ అని భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే… తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకోనున్నాయి.