కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకారి అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ వచ్చిందని, అదే విధంగా కేసీఆర్ గద్దె దిగాలంటే ఎన్నికలు రావాలని, ఎన్నికలే రాష్ట్రానికి సర్వరోగ నివారిణి అని అన్నారు. బుధవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ నివాసంలో జరిగిన టీపీసీసీ కొత్త కార్యవర్గం, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రేవంత్ మాట్లాడారు.సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయిస్తున్నారని, బీసీలకు కార్పొరేషన్ రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు కేసీఆర్ హయాంలో బాగా నష్టపోతున్నారని చెప్పారు. కేసీఆర్, ఆయన తనయుడు అమరవీరుల స్తూపాన్ని కూడా వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారని, వీరి అవినీతి వ్యవహారాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. తెలంగాణలో చదువుకున్న యువత తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ మొదటి ప్రణాళిక నిరుద్యోగ సమస్యలపైనే ఉంటుందని చెప్పారు. తాను సోనియా మనిషినని చెప్పిన రేవంత్… కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర పార్టీల్లో పనిచేశానన్నారు.