రోజువారీ ప్రజా సమస్యలపై రేవంత్‌రెడ్డి పోరాటం

రోజువారీ ప్రజా సమస్యలపై రేవంత్‌రెడ్డి పోరాటం

దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహించి, ప్రజలలో చైతన్యం తీసుకువచ్చామని కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రోజువారీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, నిరుద్యోగ సమస్య లపై పోరాటానికి కార్యచరణ సిద్ధం చేశామని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు 65 రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తామని వెల్లడించారు.

ఆగస్ట్ 15 దేశ ప్రజలకు ఎంత పవిత్రమైందో, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన రోజు అంతే పవిత్రమైనదని పేర్కొన్నారు. విద్యార్థి, నిరుద్యోగులతో ఆందోళన చేస్తామని, 14ఎఫ్‌ తొలగించాలని నిరుద్యోగులు పోరాటం ప్రారంభిస్తే దాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యువతను బలిదానాల వైపు హరీష్ రావు ఉసిగోల్పారని దుయ్యబట్టారు. శ్రీకాంతాచారి ఆత్మార్పణం తర్వాతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని అన్నారు.

కేసీఆర్ కక్ష్య కట్టి 4,368 ప్రాధమిక పాఠశాలలు మూసివేశారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఉన్నత చదువులను పేదలకు కాంగ్రెస్ దగ్గర చేసిందని తెలిపారు. సన్నబియ్యం, చేప పిల్లల కోసం కాదు, తెలంగాణ తెచ్చుకుంది పేదలకు కావలసింది విద్య అని అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి ఉందని మండిపడ్డారు. కాలేజీలు సర్టిఫికెట్‌లు ఇవ్వక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంన్నారని మండిపడ్డారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వీరందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

నెలకు పదివేల మంది ఉద్యోగ విరణమ చేస్తూన్నారని, నియామకాలు మాత్రం చేయడం లేదని దుయ్యబట్టారు. వీటంన్నింటిపై విద్యార్ది, నిరుద్యోగులతో ఉద్యమం చేస్తామని, అక్టోబర్ 2న దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు పాదయాత్ర చేస్తామని అన్నారు. వీలైనంత తొందరలోనే హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. హుజూరాబాద్‌లో అఖిలపక్ష పార్టీల మద్దతు కూడా తీసుకుంటామని అన్నారు.