Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో అధికారం సత్యం విలువలు మిధ్య అనుకునే రోజులు ఇవి. రేవంత్ ఎప్పుడైతే టీడీపీ కి గుడ్ బై కొడతాడు అనుకున్నారో అప్పుడే బాబు సీక్రెట్స్ బయటికి వస్తాయని వైసీపీ నేతలు ఎంతో ఆశగా ఎదురు చూసారు. కానీ జరిగింది వేరు. రేవంత్ రెడ్డి టీడీపీ కి రాజీనామా చేస్తూ ఈ తరం రాజకీయాల్లో ఊహకైనా అందని పనులు చేశారు. ఎక్కడా తాను వదిలిపెట్టి వెళ్లే పార్టీ గురించి చెడుగా చెప్పలేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర అయితే కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. ఆయన గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా చూసారు. పైగా బాబు తనకు చేసిన మేలు గుర్తు చేసుకుని మరీ పొగిడారు. ఇంతకన్నా ముఖ్యమైన నిర్ణయం ఇంకోటుంది. అదే టీడీపీ వల్ల తనకు దక్కిన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం. ఈ రెండు విషయాల్లో రేవంత్ చూపిన సంయమనం రాజకీయాల్లో రేవంత్ కి ప్రత్యేక స్థానం కల్పిస్తాయని చెప్పడంలో ఏ డౌట్ అక్కర్లేదు. బాబు పట్ల అపార గౌరవం, గురుభావం వుండే రేవంత్ ఆయనకి ఇచ్చే గురుదక్షిణ ఇదే అనుకుంటే పొరపాటే. రేవంత్ తీసుకున్న తాజా నిర్ణయం దేశ రాజకీయాల్లో వచ్చే పెనుమార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పుడు ఆ సంగతి ప్రస్తావిస్తే కాస్త హాస్యాస్పదం అనిపించినా రేవంత్ ఎత్తుగడ బాబు కి తిరుగులేని గురుదక్షిణ అయ్యే రోజు తప్పక వస్తుంది.
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైనా తాను అధినేతగా వున్న టీడీపీ మూలాలు కాంగ్రెస్ వ్యతిరేకత అన్న పునాదుల మీదే ఉన్నాయని బలంగా నమ్ముతారు. అందుకే సంకీర్ణ రాజకీయాల్లో ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎప్పుడూ కాంగ్రెస్ తో మాత్రం దూరం పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ మిత్ర పక్షంగా వుంటూ కూడా ప్రధాని మోడీ తో పదేపదే అవమానాలు ఎదురు అవుతున్నా చంద్రబాబు రాజకీయంగా పూర్తి సంయమనం తో వుంటున్నారు. ఇక్కడే రేవంత్ ఆలోచనలు భిన్నంగా వున్నాయి. ఒకప్పుడు బీజేపీ ని ఈ దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు రాజకీయంగా ఏకాకిని చేశాయి. కాలక్రమంలో ఆ పార్టీ తో కూడా పొత్తులకి మొగ్గుజుపాయి. కాంగ్రెస్ ని కూడా అలాగే చూసి ఆ పార్టీ తో రాజకీయ ప్రయాణం చేస్తే ఒక్క తెలంగాణ లో కెసిఆర్ ని దెబ్బ తీయడమే కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది దోహదపడుతుంది అని రేవంత్ భావిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకత ఇప్పుడిప్పుడే పెరుగుతున్న వేళ చంద్రబాబు లాంటి నాయకుడు బీజేపీ కి దూరం అయ్యి కాంగ్రెస్ కి దగ్గర అయితే దేశ రాజకీయాలు సమూలంగా మారిపోతాయి.
మోడీ దగ్గర దక్కని గౌరవం 10 జన్ పథ్ లో బాబుకి దొరుకుతుందని రేవంత్ అపార విశ్వాసం. రేవంత్ కాంగ్రెస్ లో చేరాక చేయబోయే పనుల్లో, పెట్టుకున్న టార్గెట్స్ లో కాంగ్రెస్ , బాబు మధ్య 2019 ఎన్నికల తర్వాత సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడం. నిజంగా రేవంత్ ఆలోచనలు అమలు రూపం దాల్చి బీజేపీ ఓడిపోయి బాబు కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తే అదే ఆయనకి శిష్యుడు ఇచ్చే అరుదైన గురుదక్షిణ అవుతుంది. ఆ గురుదక్షిణతో దేశ రాజకీయాలు మారడమే కాదు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల నిజం కూడా కావొచ్చు.