ఈ ఘటనను సినిమాగా తీయటం సరికాదు

ఈ ఘటనను సినిమాగా తీయటం సరికాదు

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారటమే కాదు.. తరచూ తన వ్యాఖ్యలతో.. సినిమాలతో వార్తల్లో నిలుస్తుంటారు రాంగోపాల్ వర్మ. సంచలన పరిణామాల్ని సినిమాలుగా తీయటం.. ఏదైనా ప్రముఖ ఘటన చోటు చేసుకున్నంతనే దానికి సంబంధించిన సినిమాను ప్రకటించటం వర్మకు అలవాటే. ఇప్పటికి పలు సినిమాలు తీసిన ఆయన.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతాన్ని సినిమా రూపంలో తీయనున్నట్లు ప్రకటించారు వర్మ.

ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే ఆయన విడుదల చేశారు. దీనిపై దిశ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్ర హాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలని వారు కోరుతున్నారు.

ఈ ఘటనను సినిమాగా తీయాలనుకోవటం సరికాదని దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ తీస్తున్న సినిమాను కేంద్ర ప్రభుత్వం.. సెన్సార్ బోర్డు ఎందుకు నియంత్రించటం లేదో ప్రశ్నించాలని తన పిటిషన్ లో కోరారు. దీనికి వర్మ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. నిజాలు చెప్పటం కోసమే తాను సినిమాను చూస్తున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థనను త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని.. సెన్సార్ బోర్డును ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) ఉదయం రాంగోపాల్ వర్మ నివాసం ముందు దిశ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. తమ కుమార్తెకి జరిగిన దారుణ ఉదంతాన్ని సినిమాగా తీయటాన్ని వారు తప్పు పట్టారు. ఈ పరిణామం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మరి.. తాజా పరిణామంపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.