రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే వివాదం, సంచలనం గుర్తొస్తుంటాయి. వర్మ చేసే సినిమాలు, ఆయన మాట్లాడే తీరు దానికి అద్దం పడుతుంటుంది. ఎలాంటి విషయాన్నైనా తనదైన కోణంలోనే చూసే వర్మ.. ఇప్పటికే రాయలసీమ రాజకీయాలు, రక్త చరిత్ర, పవన్ స్టార్ అంటూ పలు వివాదాస్పద సినిమాలు చేసి సంచలనం సృష్టించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘కొండా’ పేరుతో మరో సంచలనానికి తెర లేపబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇటీవలే కొండా మురళి- సురేఖ దంపతులపై సినిమా ప్రకటించారు ఆర్జీవీ. ఎన్‌కౌంటర్‌లో చంపబడిన నక్సలైట్ ఆర్.కె అలియాస్ రామకృష్ణకి, కొండా మురళికి ఉన్న ప్రత్యేక సంబంధం గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నట్లు తెలుపుతూ వర్మ అనౌన్స్ చేశారు. తాను తీస్తున్నది సినిమా కాదని, నమ్మశక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర అన్నట్లుగా ఆయన హింట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘కొండా’ ముంచి కొత్త పోస్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘ఈ సినిమా 80ల్లో నక్సల్ బ్యాక్ డ్రాప్ లో సాగే.. పీరియాడికల్ లవ్ స్టోరీ’ అని ట్విట్టర్ వేదికగా తెలిపిన వర్మ.. ఈ పోస్టర్‌లో కొండా మురళి క్యారెక్టర్‌ను ఫుల్ అగ్రెసివ్‌గా చూపించారు. గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్ధం కాలే? అంటూ పోస్టర్‌పై రాసిన పదాలు ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందనే విషయాన్ని తెలుపుతున్నాయి.
వరంగల్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ-మురళి దంపతులకు సంబంధించిన కీలక విషయాలను సేకరించిన వర్మ.. ఈ మూవీతో తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టబోతున్నారు. 80,90ల్లోని ల్యాండ్ లార్డ్స్ రాక్షసత్వాన్ని ‘కొండా’ మూవీతో తెరమీద చూపించబోతున్నారని టాక్. దీంతో పొలిటీషియన్స్‌గా తమ మార్క్ చూపించిన ఈ ఇద్దరినీ ఎలా చూపించనున్నారనే దానిపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాలో అదిత్ అరుణ్, ఇర్రా మోర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.