ఆర్యన్‌ ఖాన్‌ పై వర్మ వ్యాఖ్యలు

ఆర్యన్‌ ఖాన్‌ పై వర్మ వ్యాఖ్యలు

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ లభించడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పలువురు ఖాన్‌ ఫ్యాన్స్‌కూడా సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

ఆ దేవునికి ధన్యవాదాలు. ఒక తండ్రిగా చాలా రిలీఫ్‌ పొందుతున్నాను. అంతా మంచిగా, సానుకూలంగా జరగాలని ఆశిస్తున్నానంటూ నటుడు మాధవన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే కాలమే తీర్పు చెబితే సాక్షులతో అవసరం లేదంటూ విలక్షణ నటుడు సోనూసూద్‌ కూడా ట్వీట్‌ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్‌, తదితరులు ట్విటర్‌ ద్వారా సంతోషాన్ని ప్రకటించారు.

ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడురాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మెజారిటీ ప్రజలు ముకుల్ రోహతగి లాంటి ఖరీదైన లాయర్లను నియమించు కోలేరు. అంటే దీనర్థం అండర్ ట్రయల్‌ గా అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్టేగా అని ప్రశ్నించారు. అంతేకాదు ఇన్నాళ్లు ఆర్యన్‌కు బెయిల్ రాలేదంటే.. మునుపటి లాయర్లు చాలా అసమర్థులా, అందుకే అనవసరంగా ఆర్యన్‌ ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చిందా? అంటూ ఆర్‌జీవీ ట్వీట్‌ చేశారు.

కాగా ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబరు 3వ తేదీన అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ లభించింది. దాదాపు మూడు వారాల తరువాత ఎట్టకేలకు ముంబై హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.