బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతికేసులో మాదకద్రవ్యాల సంబంధిత నేరారోపణలు ఎదుర్కొంటోన్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని మూడు రోజుల విచారణ అనంతరం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబైలో మంగళవారం అరెస్టు చేసింది. రియా వాట్సాప్ ఛాట్స్ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన ఎన్సీబీ తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటికొచ్చాయి. మాదక ద్రవ్యాల మత్తులో జోగుతోన్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమ చిట్టా బట్టబయలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్లో మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న దాదాపు 30 మంది పేర్లను రియా ఎన్సీబీ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. తనకు మాదక ద్రవ్యాల డీలర్లతో ఎటువంటి సంబంధాల్లేవని ఆ విచారణలో తెలిపారు.
కరోనా లాక్డౌన్ కాలంలో డ్రగ్స్ దొరకడం కష్టం కావడంతో, రియాచక్రవర్తి తన సోదరుడి ద్వారా డ్రగ్స్ తెప్పించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. నిజానికి రెండో రోజు విచారణ అనంతరమే రియాను అరెస్టు చేయాల్సి ఉండగా, మాదకద్రవ్యాలకు సంబంధించిన మరింత లోతైన సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో ఎన్సీబీ, మూడో రోజు కూడా ఆమెను విచారించాలని భావించింది. అందులో భాగంగానే మంగళవారం ఉదయం తిరిగి ముంబైలోని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి రియాను రప్పించి విచారించింది. విచారణ అనంతరం ఎన్సీబీ రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసినట్టు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎన్సీబీ కె.పిఎస్.మల్హోత్రా చెప్పారు. అరెస్టు అనంతరం వైద్య పరీక్షల కోసం ముంబైలోని సియాన్ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్ళారు.
ఆమెకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు కోవిడ్–19 పరీక్ష కూడా నిర్వహించగా, నెగిటివ్ వచ్చింది. మాదకద్రవ్యాల చట్టంలోని సెక్షన్8(సి)మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం, అమ్మడం, 20(బి)(2) తక్కువ మోతాదులో నిషేధిత డ్రగ్స్ వినియోగం, వాటిని కలిగి ఉండడం తదితర సెక్షన్ల కింద రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది. ఈనెల 22 దాకా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు రియాను హాజరుపరిచిన ఎన్సీబీ… సుశాంత్‌కు డ్రగ్స్ కొనుగోలు చేసిన సిండికేట్‌లో రియా క్రియాశీలకంగా పనిచేశారని ఆరోపించింది. కస్టడీ కోరడం లేదని తెలిపింది. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. రియా బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయిస్తామని ఆమె లాయర్ తెలిపారు.