బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. ఈ మేరకు నేడు(బుధవారం) విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు రియా చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ లభించలేదు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను బోంబే హైకోర్టు కొట్టి వేసింది.
ఎట్టకేలకు రియాకు బెయిల్ లభించడంతో 28 రోజుల తర్వాత ముంబైలోని బైకుల్లా జైలు నుంచి బయటకు వచ్చారు. దీనికి సబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఈ విషయంపై డీసీపీ సంగ్రాంసింగ్ నిషందర్ మాట్లాడుతూ.. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఎవరైన ఆమె వాహనాన్ని వెంబడించడం, అడ్డుకోవడం వంటివి చేస్తే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాతో సహా వెంబండించిన వారే కాకుండా ఇలాంటి చర్యలకు ప్రేరేపించిన వారిపై కూడా ఎంవీ చట్టం ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.
కాగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హై కోర్టు ఆమెకు పలు షరతులు విధించింది. రియాను దేశం వదిలి వెళ్లరాదని స్పష్టంచేస్తూ ఆమె పాస్పోర్ట్ని సమర్పించాల్సిందిగా చెప్పింది. కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని.. ఒకవేళ గ్రేటర్ ముంబై దాటి వెళ్లాల్సి వస్తే.. కేసు విచారణ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని షరతులు విధించింది. ప్రతీ పది రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది.