అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభంపై బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ పౌరులు, ప్రధానంగా మహిళల స్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వేతన సమానత్వం కోసం పోరాడుతోంటే.. అఫ్గాన్ మహిళలు మాత్రం అమ్మకానికి గురవుతున్నారన్నారు. వారే ఆదాయంగా మారిపోయి జీవన పోరాటం చేస్తున్నారన్నారు. అఫ్గాన్ మహిళలు, మైనార్టీల పరిస్థితిని చూసి హృదయం బద్దల వుతోందని పేర్కిన్నారు.
ఈ మేరకు సోమవారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఈ సంక్షోభంలో అండగా నిలబడాలని రియా గ్లోబల్ నాయకులను కోరారు. “పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టండి… మహిళలు కూడా మనుషులే” అని వ్యాఖ్యానించారు. మరోవైపు అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు, ఇతర సినీరంగ ప్రముఖులు స్పందించారు.
‘ప్రపంచం మౌనంగా చూస్తుండగా ఇంతటి సంక్షోభం.. మానవత్వానికి సిగ్గుచేటు’ అంటూ నటుడు కరణ్ టాకర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. అలాగే చిత్రనిర్మాత శేఖర్ కపూర్ కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్ ప్రజలకోసం ప్రార్థిస్తున్నాననీ, విదేశీ శక్తుల వలస రాజ్యం ఆశలో అఫ్గాన్ నాశనం మైందని కపూర్ ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, రిచా చద్దా, అనురాగ్ కశ్యప్, సనమ్ పురి, హన్సల్ మెహతాతో సహా ఇతర చిత్ర పరిశ్రమ పెద్దలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కాగా అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌తోపాటు కీలక భూభాగాలను అధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు యుద్ధం ముగిసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని కాబూల్ నగరంలో హృదయ విదారక దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపాయి.
ముఖ్యంగా దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయారు. కాబూల్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దీంతో బీతిల్లిన ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా తరలి రావడంతో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు, విమాన చక్రాలను పట్టుకుని మరీ వేళ్లాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ముఖ్యంగా కదులుతున్న విమానాన్ని అందుకోవాలన్న ఆశతో రవ్‌వై వేలాదిగా పరుగులుపెడుతున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.