రియా నిజంగానే రకుల్ పేరు చెప్పిందట

రియా నిజంగానే రకుల్ పేరు చెప్పిందట

రకుల్ ప్రీత్ డ్రగ్స్ తీసుకునే అలవాటుందా లేదా.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి ఆమె పేరు చెప్పిందా లేదా.. ఈ సందేహాలు అందరినీ తొలిచేస్తున్నాయి. ముందేమో రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్.. మరికొందరి పేర్లను రియా చెప్పిందని.. ఛార్జ్ షీట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారి పేర్లను ప్రస్తావించిందని వార్తలొచ్చాయి. కానీ తర్వాతేమో అదంతా అబద్ధమని.. వాళ్ల పేర్లే ఆమె ఎత్తలేదని ఎన్సీబీ అన్నట్లుగా ప్రచారం జరిగింది.

మొదట రకుల్ పేరు బయటికి వచ్చినపుడు ఆమెను సోషల్ మీడియా జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు. తర్వాత తొలి వార్త అబద్ధమని ప్రచారం జరిగినపుడు #SORRYRAKUL అన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. రకుల్‌కు మద్దతుగా చాలామంది ఫిలిం సెలబ్రెటీలు లైన్లోకి వచ్చారు. అందులో సమంత కూడా ఒకరు. ఆమె కూడా ఇదే హ్యాష్ ట్యాగ్‌తో రకుల్‌కు మద్దతుగా నిలిచింది.

రకుల్ మీద అన్యాయంగా అభాండాలు వేశారన్నట్లుగా సెలబ్రెటీలు మండిపడ్డారు. కానీ ఇంతలో మళ్లీ కథ మలుపు తిరిగింది. రియా నిజంగానే రకుల్, సారా, తదితరుల పేర్లు చెప్పింది, వాళ్లు డ్రగ్స్ వాడేవాళ్లు అన్నది తాజా సమాచారం. మరి నిన్నటిదాకా #SORRYRAKUL అని ఎమోషనల్‌గా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసిన వాళ్ల పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. మరి వాళ్లందరూ ఇప్పుడు యుటర్న్ తీసుకుంటారా? ఒకవేళ భవిష్యత్తులో రకుల్ తప్పు చేసినట్లు రుజువైతే వీళ్లంతా ఏమంటారు అన్నది చూడాలి.

ఈ సోషల్ మీడియా జమానాతో ఉన్న ఇబ్బందే ఇది. ఒక సమాచారం కనిపిస్తే చాలు.. ఏది నిజం, ఏది వాస్తవం అని చూసే పరిస్థితే ఉండదు. వెరిఫై చేసుకోకుండానే ట్రోలింగ్ మొదలుపెడతారు. లేదంటే ఎలివేషన్లు ఇస్తారు. తీరా అసలు విషయం తెలిశాక ఎలా స్పందించాలో అర్థం కాదు. కొంచెం ఓపిక పట్టకుండా ఓవర్ రియాక్ట్ అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి.