ప్రమాదంలో 9 మంది దుర్మరణం

ప్రమాదంలో 9 మంది దుర్మరణం

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఆదివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 9 మంది ఇన్నోవా వాహనంలోనే మరణించగా.. దాన్ని నడుపుతున్న పెళ్లికుమార్తె తండ్రి, బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు ఆస్పత్రిలో ప్రాణాలొదిలారు. అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం, ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న పెద్దలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.

పోలీసులు, బంధువుల కథనం మేరకు.. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన వెంకటప్పనాయుడు కుమార్తె వివాహవేడుక ఆదివారం కర్ణాటక బళ్లారిలో జరిగింది. పెళ్లి ముగిశాక వెంకటప్పనాయుడు, ఆయన బంధువులు 8 మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వెంకటప్పనాయుడు డ్రైవింగ్‌ చేయసాగారు. బూదగవి వద్ద వీరి వాహనం, అనంతపురం నుంచి బళ్లారి వైపు ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు రోడ్డుపక్కనున్న పొలంలోకి దూసుకెళ్లాయి. ఇన్నోవా ముందుభాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ ఛిద్రమై.. ఇన్నోవాలోనే ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో వెలికి తీయాల్సి వచ్చింది.