జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం చక్రాల కింద ఓ కుటుంబం ఛిద్రమైంది. ఇద్దరు చిన్నారులు సహా తండ్రి ప్రాణాలు కోల్పోగా.. తల్లీకొడుకులు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ అత్యంత విషాద ఘటన వెల్గటూరు మండలం పాశిగామ వద్ద చోటుచేసుకుంది. వెల్గటూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి(40)కి భార్య మనోజ, కొడుకులు ఆదిత్య, కన్నయ్యతో పాటు కూతురు చిట్టీ సంతానం.
మనోజ అత్త ఇటీవల చనిపోవడంతో మూడునెలల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి బైక్‌పై ధర్మపురి మండలం దొంతపూర్ వెళ్లాడు.అక్కడ కార్యక్రమం ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా డీసీఎం వ్యాన్ మృత్యువై దూసుకొచ్చింది. పాశిగామ వద్ద బైక్‌ని డీసీఎం బలంగా ఢీకొట్టడంతో అంతా ఎగిరి కిందపడిపోయారు. వారిపై నుంచి వాహనం దూసుకుపోవడంతో కొడుకు కన్నయ్య, కూతురు చిట్టితో పాటు తండ్రి తిరుపతి అక్కడికక్కడే మరణించారు.
భార్య మనోజ, మరో కొడుకు ఆదిత్య తీవ్రగాయాల పాలయ్యారు. డీసీఎం ఈడ్చుకెళ్లడంతో శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. అవయవాలు రోడ్డుపై తెగిపడి భీతావహ పరిస్థితి నెలకొంది. స్థానికులు స్పందించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.