అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి

అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన రోడ్డుప్రమాదం తెలంగాణలోని జనగామ జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన రాంచంద్రారెడ్డి, రజనీరెడ్డి తీవ్రంగా దంపతులు తీవ్రంగా గాయపడగా.. వారి కుమారుడు అర్జిత్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కుమార్తె అక్షితా రెడ్డి సైతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. రాంచంద్రారెడ్డి 20ఏళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లి లాస్‌ఏంజిల్స్‌లో స్థిరపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతోంది. రాంచంద్రారెడ్డి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తుండగా.. వీరి కూతురు అక్షితారెడ్డి పదకొండు, కొడుకు ఆర్జిత్‌రెడ్డి పదో తరగతి చదువుతున్నారు.

శనివారం మిత్రుడి ఇంట్లో విందు ఉండగా రాంచంద్రారెడ్డి కుటుంబంతో సహా వెళ్లారు. రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వెళ్లుండగా లాస్‌ఏంజిల్స్‌లోని ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కారును ఆపారు. అదే సమయంలో ఓ మహిళ మద్యం మత్తులో కారు డ్రైవింగ్‌ చేస్తూ వారి కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆర్జిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్షిత తీవ్రంగా గాయపడటంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాంచంద్రారెడ్డి, రజనీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాంచంద్రారెడ్డి ఫోన్లో తన సోదరుడు బండ్లగూడెంలో ఉంటున్న రవీందర్‌రెడ్డికి చెప్పడంతో స్థానికంగా విషాదం నెలకొంది. రాంచంద్రరెడ్డి 2016లో తన తండ్రి మృతిచెందిన సమయంలో స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. తల్లి, సోదరుడు బండ్లగూడెంలోనే ఉంటున్నారు.