మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుల్దాణా జిల్లాలో కార్మికులను తరలిస్తున్న ఓ వాహనం బోల్తాపడిన ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సింధ్‌ఖేడ్‌రాజా- మేహ్‌కర్‌ రహదారిపై దుసర్‌బిడ్‌ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ‘నాగ్‌పూర్‌- ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు’ పనుల కోసం మొత్తం 16 మంది కూలీలను వాహనంలో తరలిస్తుండగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.

వాహనం వేగంగా వెళ్లడం, రోడ్డుపై పెద్ద గుంత కారణంగా బోల్తా పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాహనం వేగంగా వెళుతున్న సమయంలో రోడ్డుపై పెద్ద గుంత రావడం వల్ల డ్రైవర్ వాహనాన్ని తప్పించబోవడంతో అదుపుతప్పింది అని బుల్దాణా ఎస్పీ అర్వింద్‌ ఛావ్రియా వెల్లడించారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా కొందరు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారని, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కిన్‌గావ్‌ రాజా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని ఎస్పీ పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో కొందరిని చికిత్స కోసం పక్కనే ఉన్నా జాల్నా జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారని, మరికొందరు సింధ్‌ఖేడ్‌రాజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్పీ చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన కూలీలు బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారేనని పోలీసులు తెలిపారు. భారీ వర్షం కూడా ప్రమాదానికి కారణమని వివరించారు.

ప్రమాద సమయంలో కూలీలతో పాటు వాహనంలో ఐరన్ రాడ్లు ఉన్నాయని, వాటి కింద కూలీలు ఇరుక్కుపోయారని స్థానికులు పేర్కొన్నారు. వాహనం కింద చిక్కుకున్నవారిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలను సేకరించి.. వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. ఐరన్ రాడ్లుపైనే కూలీలు ఎక్కినట్టు తెలుస్తోంది.