నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు, కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా బాలిక వంతెన పైనుంచి నందిలో పడి గల్లంతైంది. ఈ అత్యంత విషాద ఘటన నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి కాజ్వే వంతెన వద్ద జరిగింది. విశాఖపట్నంకి చెందిన యువకులు త్రినాథ్, సాయి మేనకూరు సెజ్‌లోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నారు. వారితో కలసి పనిచేస్తున్న మోదుగులపాళెం గ్రామానికి చెందిన నాగూర్‌తో కలసి భోజనం చేసేందుకు నాయుడుపేట బయలుదేరారు.
నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరులో నివాసముంటున్న మురళి, అతని భార్య సుజాత కూతురు ప్రవళిక(9)తో కలసి బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బైక్‌పై ప్రయాణమయ్యారు. నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి కాజ్వే వద్దకు రాగానే రెండు బైకులు ఢీకొని.. మరో కారుని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా త్రినాథ్, సాయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగూర్ గాయాలతో బయటపడ్డాడు.
ఈ ప్రమాదంలో మురళి దంపతులు, వారి కుమార్తె కాజ్వే పై నుంచి కిందపడిపోయారు. వెంటనే తేరుకున్న దంపతులు చిమ్మచీకట్లో పైకి వచ్చేసరికే తమ కూతురు నీళ్లలో పడి కొట్టుకుపోవడం చూసి కాపాడండంటూ ఆర్తనాదాలు చేశారు. చిన్నారి నీళ్లలో గల్లంతైంది. సమాచారం అందుకున్న నాయుడుపేట సీఐ వేణుగోపాలరెడ్డి ఫైర్ సిబ్బందితో కలసి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.