ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా సచేంది ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డుపై ఉన్న జేసీబీని ఢీకొంది. ఆ తీవ్రతకు ఆ జేసీబీ రోడ్డు పక్కన పడిపోగా, బస్సు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. బస్సులోనే ప్రయాణికులంతా ఇరుక్కుపోయి, తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో 17 మంది చనిపోగా ఐదుగురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామన్నారు.