ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-లక్నో హైవేపై ఒక ప్రైవేటు బస్సు, ఆగి ఉన్న డీసీఎం ట్రక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు ఒక్కసారిగి బోల్తాపడింది. అయితే, బస్సులో ఉన్న 6 గురు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం… ఒక ప్రైవేటు బస్ పంజాబ్ నుంచి పిల్‌భీత్‌కు 50-60 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో లక్నో హైవేపై ప్రయాణికులను ఎక్కించువడానికి ఆగి ఉన్న డీసీఎం ట్రక్‌ను ముందు నుంచి వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. డీసీఎం ట్రక్‌లో కూడా 25 మంది ప్రయాణికులు ఉన్నారు.
అయితే, సంఘటన జరిగిన వెంటనే పోలీసులు.. స్థానికుల సహయంతో, రెండు వాహనాల్లోని క్షతగాత్రులను మొరాదాబాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మృతిచెందిన వారిలో ఆశీశ్, సురేష్, నాన్‌హేలుగా గుర్తించారు. వీరందరు డీసీఎం ప్రయాణికులని సమాచారం. తెల్లవారు జామున జరిగిన ఈ దుర్ఘటనకు కారణాలు తెలియరాలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మొరాదాబాద్ ఎస్పీ అమిత్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.