ప్రముఖ పారిశ్రామిక వేత్త, పల్లవాగ్రానైట్స్ అధినేత డాక్టర్ కొడలూరు సుబ్బారెడ్డి సోదరుడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చెంగల్పట్టు సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బారెడ్డి తమ్ముడు నరోత్తంరెడ్డి భార్య కె.భారతి రెడ్డి , కుమారుడు డాక్టర్ కె. శ్రీహిమవర్ష్ దుర్మరణం చెందారు. సుబ్బారెడ్డి సోదరుడి కుటుంబం చెన్నై మైలాపూర్, అభిరామపురంలో ఉంటున్నారు.
చాలాకాలం క్రితం సోదరుడు నరోత్తంరెడ్డి మరణించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ డాక్టర్ అయిన కె. శ్రీహిమవర్ష్ తన తల్లి భారతి రెడ్డితో కలిసి జీప్‌లో దిండివనం సమీపంలోని ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం సోమవారం తిరుగుపయనం అయ్యారు. సాయంత్రం మార్గం మధ్యలోని చెంగల్పట్టు జిల్లా పళవేలి గ్రామం వద్ద వీరి జీప్ ప్రమాదానికి గురైంది. అతివేగంగా వచ్చిన ఓ కారు జీప్‌ను ఢీకొట్టి వెళ్లింది.
దీంతో అదుపు తప్పిన జీపు చెట్టును ఢీకొని డివైడర్ దాటి అవతలి మార్గంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న తల్లి, కుమారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ సమాచారంతో సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చెంగల్పట్టు తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు.
వీరి భౌతికకాయాలను ఆళ్వార్‌పేట, అభిరామపురం, సుబ్రమణ్యం వీధి, నెంబర్ 19 చిరునామాలో ఆప్తులు, కుటుంబీకుల సందర్శనార్ధం ఉంచారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. టీనగర్ కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, ఎంబీబీఎస్ పూర్తి చేసిన కె.శ్రీహిమవర్ష్ ఎం.ఎస్ చదివేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరణించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.