వాళ్ళని వీళ్ళని కొడితే ఏమొస్తుంది, అందుకే ఏకంగా ముఖ్యమంత్రి భార్య దగ్గరే డబ్బు కొట్టేసి ఝలక్ ఇచ్చాడో కేటుగాడు. బ్యాంక్ మేనేజర్ గా బిల్డప్ ఇచ్చి మరీ ఆమె అకౌంట్ నుంచి ఏకంగా రూ.23లక్షలు నొక్కేసి బురిడీ కొట్టించాడు. తర్వాత అసలు విషయం బోధపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి కేటుగాడ్ని పట్టుకున్నారు.
కొట్టేసిన డబ్బును రికవర్ చేశారు. ఆ బాధితురాలు ఎవరో కాదు.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య, ఎంపీ ప్రీనిత్ కౌర్. పోలీసుల కథనం ప్రకారం కౌర్ గతవారం పార్లమెంట్ సమావేశాలుకు హాజరై ఢిల్లీలోనే ఉన్నారు. అదే సమయంలో ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
అవతలి వైపు నుంచి ఓ వ్యక్తి తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఎంపీగా జీతం వస్తుంది కాబట్టి ఆ కారణంతో.. శాలరీ వేసేందుకు అకౌంట్‌కు సంబంధించిన వివరాలు అడిగాడు. కౌర్ అతడు నిజంగానే బ్యాంక్ మేనేజరని నమ్మి అయన అడిగిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఏటీఎం పిన్ అడిగాడు.
ఆమె ఆ వివరాలన్నీ అతడికి చెప్పింది.. తర్వాత ఓటీపీని జనరేట్ చేసి.. ఆమెను ఆ నంబర్ చెప్పమని అడిగాడు. ఆమె ఆ నంబర్ కూడా అతడికి చెప్పేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె అకౌంట్‌లో నుంచి రూ.23 లక్షలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది.
దీంతో షాక్ తిన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఫోన్‌కాల్ ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడి నుంచి డబ్బు తిరిగి వసూలు చేశారు.