విలాసవంతమైన జీవనం సాగించడానికి దొంగతనాలను ఎంచుకున్నారు. కొన్నిరోజులు ఒక ప్రాంతంలో ఇల్లుబాడుగకు తీసుకోవడం, ఇంపుగా కనిపించిన ఇంట్లో పడి దోచేయడం. ఇదీ ఆ ముఠా అలవాటు. అంతర్రాష్ట్ర దొంగలను సోమవారం బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.80 కోట్ల విలువచేసే బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బిలాల్ మండల్, షాజాన్ మండల్, మహారాష్ట్రవాసి సలీం రఫిక్ షేక్, బిహార్‌వాసి మహమ్మద్ జాలీక్ అనే నలుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
బెంగళూరు దక్షిణ విభాగంలో ఇటీవల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడ్డారు. దీంతో డీసీపీ హరీశ్‌పాండే ఆధ్వర్యంలో బసవనగుడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల జాడను కలిపెట్టి అరెస్టు చేశారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇళ్లను బాడుగకు తీసుకుని మకాం వేసేవారమని, తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలు చేసేవారమని దొంగలు తెలిపారు.
నగలను ముంబై, హైదరాబాద్ నగరాల్లో బంగారు దుకాణాల్లో విక్రయించి జల్సాలు చేసేవారు. విమానాల్లోనే రాకపోకలు సాగించేవారమని చెప్పారు. రూ.2 లక్షల విలువైన 24 వాచ్‌లు, రూ.50 వేల ల్యాప్‌టాప్, రూ.46,700 నగదు, సుమారు రూ.1.64 కోట్ల ఖరీదైన 3 కిలోల 286 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.12.60 లక్షల విలువచేసే 18 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్ట్‌తో 27 కేసులు పరిష్కారమైనట్లు పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు.