కోర్టుకు హాజరైన రోబో దర్శకుడు

robo movie director attend to court

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సౌత్‌లో అప్పట్లో 150 కోట్లను క్రాస్‌ చేసిన చిత్రంగా రోబో నిలిచింది. ఆ చిత్రంతో దర్శకుడు శంకర్‌ స్థాయి, పరిధి కూడా పెరిగింది. ఆ చిత్రంలో రజినీకాంత్‌కు జోడీగా ఐశ్వర్యరాయ్‌ నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంకు కొనసాగింపు అన్నట్లుగా ప్రస్తుతం 2.0 చిత్రాన్ని దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ సమయంలోనే ‘రోబో’ చిత్రం కథ విషయంలో శంకర్‌ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చాలా కాలంగా రోబో చిత్రం కథ నాది అని, నా అనుమతి లేకుండా శంకర్‌ చిత్రాన్ని తెరకెక్కించి విడుదల చేశాడు అంటూ రచయిత తమిళనాథన్‌ ఆరోపిస్తున్నాడు.

robo

కొన్నాళ్ల క్రితం కోర్టుకు వెళ్లిన తమిళనాథన్‌ తన తరపున వాదనలు పూర్తి చేశాడు. తమిళనాథన్‌ వాదనలు పూర్తి అయిన నేపథ్యంలో తాజాగా కోర్టు శంకర్‌ను హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రోబో కథ విషయమై శంకర్‌ హాజరు అయ్యాడు. తన లాయర్‌లతో పాటు కోర్టుకు వెళ్లిన శంకర్‌ ‘రోబో’ కథ తాను సొంతంగా రాసుకున్నాను అని, అది నాకు ఎవరు చెప్పలేదు, అది నా సొంత ఆలోచన అంటూ కోర్టు ముందు శంకర్‌ చెప్పుకొచ్చాడు. తన సినిమాకు తమిళనాథన్‌ చెబుతున్న కథకు చాలా వ్యత్యాసం ఉందని, కొన్ని విషయాల్లో పోలిక ఉన్నంత మాత్రాన కథ కాపీ అని ఎలా అంటారు అంటూ శంకర్‌ కౌంటర్‌ పిటీషన్‌ కూడా వేసినట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ‘2.0’ చిత్రం విడుదల పనుల్లో బిజీగా ఉన్న శంకర్‌ ఇలా కోర్టు చిక్కుల్లో చిక్కుకోవడం విచారకరం అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.