శ్రీలంకతో టి20 సిరీస్‌ను టీమిండియా శుభారంభం చేసింది. లక్నో వేదికగా ముగిసిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ సూపర్ సక్సెస్ అయ్యాడు. 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ 44 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయగలిగింది.
ఇంత భారీ విజయం సాధించినప్పటికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంతోషం లేదంటా. మరి దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ప్రెజంటేషన్లో మాట్లాడాడు. ”లంకతో టి20 మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషమే. కానీ ఒక్క విషయం నన్ను ఇబ్బంది పెట్టింది. మా ఫీల్డింగ్ అనుకున్నంత ప్రమాణాల్లో లేదు. మ్యాచ్‌లో కొన్ని ఈజీ క్యాచ్‌లు జారవిడిచాము. రానున్న మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. దీనికోసం ప్రాక్టీస్ సెషన్లో ఫీల్డింగ్ కోచ్‌తో సంప్రదింపులు జరిపి టెక్నిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తాం. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022 వరకు ఫీల్డింగ్‌లో బెస్ట్ టీమ్‌గా తయారవ్వాలి.” అని చెప్పుకొచ్చాడు.
”ఇక ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి రావడం సంతోషకరమైన విషయం. ఎంతోకాలం నుంచి ఇషాన్ నాకు తెలుసు. ముంబై ఇండియన్స్‌కు ఇద్దరం కలిసే ఆడుతున్నాం. పవర్ ప్లేలో అతను ఎంత విలువైన ఆటగాడో మరోసారి తెలిసొచ్చింది. మంచి రిథమ్‌తో ఇషాన్ బ్యాటింగ్ చేస్తుంటే ఒక ఎండ్ నుంచి నేను ఎంజాయ్ చేస్తూ వచ్చా. ఫామ్‌లోకి వచ్చిన ఇషాన్‌ను ఎవరు ఆపలేరు. మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇదే రిపీట్ చేస్తాడని అనుకుంటున్నా.” అని తెలిపాడు.
”జడేజా రీఎంట్రీ అదిరిపోయింది. రెండు నెలలు మాకు దూరంగా ఉన్నప్పటికి సూపర్ బౌలింగ్‌తో మెరిశాడు. నిజంగా జడేజా రావడం జట్టను మరింత బలోపేతం చేసింది. జడేజా నుంచి రావాల్సింది చాలా ఉంది. రానున్న రోజుల్లో జడేజా బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా టెస్టుల్లో జడేజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. పరిమిత ఓవర్లలోనూ జడ్డూను సరైన రీతిలో వాడుకుంటాం” అని చెప్పుకొచ్చాడు.