ఐపీఎల్ 13 వ సీజన్‌లో మొదటి నుంచి ఆదిపత్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సగర్వంగా టైటిల్ నిలబెట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ అర్ధ సెంచరీలు సాధించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ కూడా మెరవడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు విజయం ఖాయమైంది.
‘విజయాలను అలవాటుగా మార్చుకోవాలని టోర్నీ ఆరంభంలో నేను చెప్పాను. కుర్రాళ్లు దానిని చేసి చూపించారు. తొలి బంతి నుంచి ఇప్పటి వరకు మేం టైటిల్ లక్ష్యంగానే ఆడాం. సీజన్ మొత్తం మాకు అనుకూలంగా సాగింది. బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని.
అందరూ బాగా ఆడుతుండటంతో అప్పటికప్పుడు తుది జట్టును మార్చుకునే సౌలభ్యం మాకు కలిగింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ చాలా బాగా ఆడారు. మా విజయంతో సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. ఐదో టైటిల్ సాధించిన సమయంలో మేం అభిమానుల మధ్య లేకపోవడం నిరాశ కలిగిస్తున్నా వారు వేర్వేరు రూపాల్లో మాకు ఎంతో మద్దతు పలికి ప్రోత్సహించారు’అని పోస్టు మ్యాచ్ ప్రజెంటేషన్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.