టీమిండియా కొత్త వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే టి20 కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను గెలిపించి మంచి మార్కులు సాధించాడు. తాజాగా వన్డే కెప్టెన్సీని అందుకున్న రోహిత్‌కు ఇక మిగిలింది టెస్టు కెప్టెన్సీ మాత్రమే. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ”అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుంది” చేసిన వ్యాఖ్యలు చూస్తే రోహిత్ త్వరలోనే టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఇదే రోహిత్ శర్మ టీమిండియా సాధించిన 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడిగా లేడు. ఆ సమయంలో రోహిత్ ఫామ్‌లో లేకపోవడంతో అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై రోహిత్ అప్పట్లో ట్విటర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా రోహిత్ కెప్టెన్ కావడంతో.. 10 ఏళ్ల క్రితం ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ”2011 ప్రపంచకప్‌కు సంబంధించి టీమిండియా జట్టుకు ఎంపికకాకపోవడం చాలా బాధ కలిగించింది. ఆ క్షణంలో క్రికెట్ నుంచి వెళ్లిపోదామనుకున్నా. కానీ ఆటపై ఉన్న ప్రేమ నన్ను ఆపేసింది. నిజాయితీగా చెప్పాలంటే.. ఆ సమయంలో ఏ కోణంలో చూసిన అది పెద్ద డ్రాబ్యాక్లా కనిపించింది.” అంటూ ట్వీట్ చేశాడు.
సరిగ్గా పదేళ్ల తర్వాత చూసుకుంటే ప్రస్తుతం రోహిత్ శర్మ వైట్‌బాల్ క్రికెట్(వన్డే, టి20)కు కెప్టెన్‌గా ఉన్నాడు. తన సారధ్యంలోనే టీమిండియా రానున్న రెండేళ్లలో రెండు మేజర్ ఐసీసీ టోర్నీలు( టి20 ప్రపంచకప్ 2022, ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023) ఆడనుంది. మరి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా కప్ కొడుతుందేమో చూడాలి. ఇక ధోని సారధ్యంలో 2015.. కోహ్లి సారధ్యంలో 2019 వన్డే ప్రపంచకప్‌ల్లో రోహిత్ సభ్యుడిగా ఉన్న టీమిండియా కప్ కొట్టడంలో విఫలమైంది.