ఆయనతో పనిచేయడం అద్భుతం

ఆయనతో పనిచేయడం అద్భుతం

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును ముందంజలో నిలుపుతానని పేర్కొన్నాడు. సారథిగా తన బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తానని తెలిపాడు. ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపాడు. అదే విధంగా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం అత్యద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు.

టీ20 వరల్‌కప్‌-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్‌ బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మను.. వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సారథి హోదాలో హిట్‌మ్యాన్‌ తొలిసారిగా బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ మేరకు… ‘‘అతిపెద్ద బాధ్యత.. ఈ అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాను మరింత గొప్పగా నిలిపేందుకు నా వంతు కృషి చేస్తా.. నిజంగా ఇదొక భావోద్వేభరితమైన ప్రయాణం. ఏ అవకాశాన్నైనా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు నేను కృషి చేస్తా.. ఆటగాళ్లతో మనసు విప్పి మాట్లాడి.. వాళ్లతో చర్చించి.. ఎవరి పాత్ర ఏమిటో అర్థమయ్యేలా చెబుతా’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.