ఇకపై ప్ర‌యోగాలు ఉండ‌వు

ఇకపై ప్ర‌యోగాలు ఉండ‌వు

రేప‌టి నుంచి శ్రీలంకతో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్‌లో ఎలాంటి ప్రయోగాలకు తావు లేద‌ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. ప‌రిమిత ఓవ‌ర్లలో ఓపెనింగ్ బ్యాట‌ర్‌ స్థానం కోసం ప‌దే ప‌దే ఎన్ని ప్ర‌యోగాలు చేసినా ఫ‌లితం లేద‌ని వ్యాఖ్యానించాడు. ఇక నుంచి తానే ఓపెనర్‌గా బరిలోకి దిగుతాననిని క‌న్ఫ‌మ్ చేశాడు. లంకతో సిరీస్‌కు ముందు ఏర్పాటు చేసిన‌ వర్చువల్ మీడియా సమావేశంలో ఈ మేర‌కు స్ప‌ష్టం చేశాడు. ఈ సమావేశంలో జట్టు కూర్పు తదితర అంశాలపై పాత్రికేయులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు హిట్‌మ్యాన్ స‌మాధానం చెప్పాడు.

విండీస్‌తో మూడో టీ20లో ఇషాన్ కిషన్-రుతురాజ్ గైక్వాడ్‌లు ఇన్నింగ్స్ ప్రారంభించ‌గా, రోహిత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్ర‌స్తావిస్తూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు బదులిస్తూ రోహిత్ పై విధంగా బ‌దులిచ్చాడు. విండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కూడా రోహిత్ ఇలాంటి ప్రయోగమే చేశాడు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో వన్డేలో త‌న‌తో పాటు రిషభ్ పంత్‌కు ఓపెన‌ర్‌గా అవ‌కాశం ఇచ్చాడు. అయితే, ఆ మ్యాచ్‌లో పంత్ దారుణంగా విఫ‌ల‌య్యాడు. దీంతో ఆత‌ర్వాతి మ్యాచ్‌లో త‌న‌తో పాటు రెగ్యుల‌ర్ ఓపెన‌ర్ ధ‌వన్ బ‌రిలోకి దిగాడు.

ఇదిలా ఉంటే, లంక‌తో సిరీస్‌కు ముందు కీల‌క ఆట‌గాళ్లు దీప‌క్ చాహ‌ర్‌, సూర్యకుమార్ యాదవ్ గాయ‌ప‌డ‌టంపై కూడా రోహిత్ స్పందించాడు. గ‌త సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కీల‌క ఆట‌గాళ్లు గాయ‌ప‌డ‌టం త‌మ‌పై క‌చ్చితంగా ప్ర‌భావం చూపుతుంద‌ని అన్నాడు. సూర్యకుమార్ స్థానాన్ని దీపక్ హుడా లేదా సంజూ సామ్స‌న్‌తో భ‌ర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామ‌ని తెలిపాడు. ఈ సంద‌ర్భంగా టీమిండియా భ‌విష్య‌త్తు నాయ‌కుడు ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. కేఎల్ రాహుల్‌, రిష‌బ్ పంత్‌, బుమ్రాల‌కు మెరుగైన అవ‌కాశాలున్నాయ‌ని అన్నాడు.