దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్‌

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్‌

విరాట్‌ కోహ్లి.. టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన గంటల వ్యవధిలోనే రోహిత్‌ శర్మకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ వైరలవుతోంది. తొడ కండరాల గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్‌.. త్వరలో విండీస్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడన్న ఈ వార్త క్రికెట్‌ వరాల్లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదని, అందులో భాగంగానే కోహ్లి టెస్ట్‌ కెప్టెన్సీకి రాజీనామా చేయడం.. ఆ వెంటనే రోహిత్‌ శర్మ జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని క్రికెట్‌ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

కోహ్లి సారధ్యంలో ఆడడం ఇష్టం లేని రోహిత్‌.. ఉద్దేశపూర్వకంగానే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు డుమ్మా కొట్టాడని, కోహ్లి అన్ని ఫార్మాట్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నాడని రోహిత్‌కు ముందుగానే సమాచారం ఉందని, ఆ ప్రకారమే అతను గేమ్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నాడని కోహ్లి అభిమానులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బీసీసీఐ అధ్యక్షడు గంగూలీ, కార్యదర్శి జై షాల అండదండలుండడంతో రోహిత్‌ ఎప్పుడు కావాలంటే అప్పుడు జట్టులోకి వచ్చిపోతున్నాడని, తొడ కండరాల గాయం అన్నది కేవలం సాకు మాత్రమేనని, కోహ్లిని పూర్తిగా కెప్టెన్సీ నుంచి తొలగించాకే జట్టులోకి రావాలని రోహిత్‌ ప్లాన్‌ వేశాడని, అందుకు అనుగణంగానే అన్నీ జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు తొలుత చేతికి గాయమైందని చెప్పిన రోహిత్‌.. ఆ తర్వాత కండరాలు పట్టేశాయని ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని, ఏదో బయటికి చెప్పుకోలేని కారణంగానే రోహిత్‌.. కోహ్లిపై పరోక్షంగా పగ తీర్చుకుంటున్నాడని వాపోతున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌-వెస్టిండీస్ జట్ల మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 6 నుంచి 20 మ‌ధ్య వ‌న్డే, టీ సిరీస్‌లు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్‌లో మూడు వ‌న్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఫిబ్ర‌వ‌రి 6న తొలి వ‌న్డే, 9న రెండో వ‌న్డే, 12న మూడో వ‌న్డే జ‌ర‌గ‌నుండగా.. ఫిబ్ర‌వ‌రి 15న తొలి టీ20, 18న రెండోది, 20న మూడో టీ20 జ‌ర‌గ‌నున్నాయి.