ఆటగాడికి రోహిత్‌ శర్మ శాపనార్థం

ఆటగాడికి రోహిత్‌ శర్మ శాపనార్థం

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహచర ఆటగాళ్లను ట్రోల్‌ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. తాజాగా హిట్‌మాన్‌.. ముంబై ఇండియన్స్‌ సహచర ఆటగాడు ధవల్‌ కులకర్ణికి శాపనార్థం పెట్టాడు. అదేంటి.. రోహిత్‌ ఇలా చేయడమేంటి అనుకుంటున్నారా.. అదంతా ఫన్నీ శాపనార్థం మాత్రమే. విషయంలోకి వెళితే.. ధవల్‌ కులకర్ణి మంగళవారం తన స్నేహితులతో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ”మేం ముగ్గురం ఏ విషయంపై మాట్లాడుకుంటున్నామో చెప్పగలరా” అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

దీనికి రోహిత్ ఫన్నీగా మరాఠీ భాషలో ఏదో శపించాడు. ”మీ ముగ్గురిలో పెద్ద..” అంటూ రోహిత్‌ మరాఠీలో పదాన్ని ఉపయోగిస్తూ ​కామెంట్‌ చేశాడు. రోహిత్‌ ఉపయోగించిన పదం మరాఠిలో ఎవరినైనా శపించడానికి వాడే పదం అని తెలిసింది. మరాఠీ అయిన ధవల్‌ కులకర్ణికి రోహిత్‌ పదం అర్థం కావడంతో లాఫింగ్‌ ఎమోజీ పెట్టాడు.ధవల్‌ కులకర్ణి టీమిండియా తరపున 12 వన్డేల్లో 19 వికెట్లు, 2 టి20 మ్యాచ్‌లాడి 3 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున 35 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు పడగొట్టాడు.. ఓవరాల్‌గా 92 మ్యాచ్‌ల్లో 86 వికెట్లు తీశాడు. ఇక హిట్‌మాన్‌ సారధ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. ఇక ఈసారి మెగావేలం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. మొత్తం 590 మంది క్రికెటర్లతో కూడిన షార్ట్‌లిస్ట్‌ జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది

ఇక దాదాపు 10 వారాల బ్రేక్‌ తర్వాత రోహిత్‌ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో కెప్టెన్‌గా పనిచేసిన రోహిత్‌.. ఆ తర్వాత గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న హిట్‌మాన్‌ విండీస్‌తో టి20, వన్డే సిరీస్‌కు తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతకముందు రోహిత్‌ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో టీమిండియా సౌతాఫ్రికాకు 0-3తో సిరీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే.