ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు వాడీవేడిగా సాగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం జరిగిన చర్చ.. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ టీడీపీ ఐదేళ్ల పాలనపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. ప్రతిపక్షం కూడా అదే రేంజ్లో కౌంటర్లు ఇస్తోంది. అయితే నాలుగో రోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీ లాబీల్లో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ- వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. ఇద్దరు నేతలు చిరు నవ్వుతో బాగున్నారా.. అంటూ పరస్పరం పలకరించుకున్నారు. తర్వాత ఇద్దరు అసెంబ్లీలోకి వెళ్లిపోయారు. ఇటు సభ ప్రారంభానికి ముందు లాబీల్లో రోజాతో సెల్ఫీల కోసం వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. కార్యకర్తలు గుంపులుగా దారిలో నిలబడటంతో.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభలోకి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. మార్షల్స్ రావడంతో.. వారు దారి చూపించడంతో ఆయన సభలోకి వెళ్లారు. రోజా చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. నందమూరి బాలయ్య కూడా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండోసారి గెలిచారు.