రోజాకి ప్రెస్ మీట్ అంటే భయం… పీకే అంటే దడ?

Roja Frearing With Prasanth Kishore To Arrange Press Meet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తిట్టే నోరు ఊరుకోదు అన్న నానుడికి సవాల్ ఎదురైంది. ఎదుటివారు ఎంత వారు అయినా, ఎలాంటి సందర్భం అయినా ఏ మాత్రం సంకోచం లేకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని తన మాటలతో ఏకేయడం రోజాకి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యే ఆమెకి టీడీపీ లో రాజకీయ ప్రవేశ బిక్ష పెట్టింది. ఆ పై వైసీపీ లో ఎమ్మెల్యేల్ని చేసింది. అయితే కాలం కలిసిరానప్పుడు తాడే పాము అయి కరిచింది అన్నట్టు ఆ నోరే ఇప్పుడు ఆమె పాలిట శాపం అయ్యింది. పదునైన నాలుకే ఆమె రాజకీయ ఎదుగుదలకి శత్రువు అయ్యింది. ఎక్కడైనా వాగ్ధాటి ఎక్కువున్న నాయకుడికి ప్రత్యర్థి పార్టీల నుంచి మాత్రమే విమర్శలు ఎదురు అవుతాయి. కానీ రోజా విషయంలో సొంత పార్టీ నుంచి కూడా అదే పరిస్థితి. ఈ విషయాలు అందరూ ఎప్పటినుంచో అనుకుంటున్నవే. అయితే అసలు మనిషికే కాస్త ఆలస్యంగా మ్యాటర్ అర్ధం అయ్యింది.

నంద్యాల,కాకినాడ ఎన్నికల ఫలితాలు రాగానే వైసీపీ శ్రేణులు సైతం తమ అధినేత జగన్ నోటిదూకుడు, ఫైర్ బ్రాండ్ రోజా మాటల్ని తప్పుబట్టడం కనిపించింది. అయితే అధినేతని అస్తమానం తప్పుబట్టలేరు కాబట్టి తప్పంతా రోజా మీదకి పోయింది. ఇక ఎన్నికల ఫలితాల సమీక్ష చేసిన సందర్భంలో వ్యూహకర్త పీకే రోజా ప్రచారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి ఆమె ఇమేజ్ ని డామేజ్ చేసాడంట. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ప్రెస్ ముందుకు రావాలన్నా, ప్రెస్ మీట్ పెట్టాలన్నా భయపడుతున్నారు రోజా. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో సీట్ అయినా ఇస్తారా లేక పంగనామం పెడతారా అన్న భయం కూడా రోజాలో ఏర్పడిందట. దానికి కారణం సీట్ల కేటాయింపుకు సంబంధించిన సర్వే చేస్తున్న ప్రశాంత్ కిషోర్ కి రోజా పొడ ఏ మాత్రం గిట్టడం లేదట.

రాజకీయంగా ఇంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న రోజాని కుటుంబ సభ్యులు కూడా ఎక్కువగా మాట్లాడవద్దని చెబుతున్నారంట. అందుకే రోజా మౌనం వహించినట్టు తెలుస్తోంది. అయినా తన సన్నిహితుల దగ్గర రోజా ఓ ప్రశ్న అడుగుతోందట. వైసీపీ ప్లీనరీ లో జగన్ చెప్పి మరీ చంద్రబాబుని తిట్టించిన విషయం అందరూ చూసారు కదా.ఇప్పుడు అలా తిట్టడమే తప్పు అంటే న్యాయం అవుతుందా అని ?. కానీ రోజా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటి రాజకీయాల్లో న్యాయం, విలువలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాల్లో లాగానే సక్సెస్ కి మాత్రమే విలువ.