పాతక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ను కొందరు దారుణంగా హత్యచేసి పరారయ్యారు. ఈ ఘటన నగరంలోని సీఏఏం హైస్కూల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. సీఏఎం హైస్కూల్ సమీపంలో రౌడీషీటర్ బాషా (32) నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య నసీమా, పిల్లలు సమీర్, సనా ఉన్నారు. బాషా వంట పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు పలువురితో వివాదాలు ఉన్నాయి. పలు పోలీసు స్టేషన్లలో కేసులు సైతం ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఓ మహిళ విషయంలో కోటమిట్ట ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మొహిసీన్‌పై చేయిచేసుకున్నాడు. అప్పట్నుంచి ఇరువురి నడుమ తరచూ వివాదాలు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మొహిసీన్ వారం రోజుల క్రితం ఇకపై గొడవలు వద్దని స్నేహంగా ఉందామని బాషాతో రాజీ చేసుకున్నాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన బాషా స్నేహంగా మెలగసాగాడు. ఈ క్రమంలో బాషా తన ఇంటి సమీపంలోని తన షెడ్లో మొహిసీన్, అతని స్నేహితులైన జాన్సన్, సమీర్, ఫరూఖ్, ప్రేమ్‌తో పాటు తన అనుచరుడైన కార్తీక్‌తో కలిసి గురువారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. కార్తీక్ సిగిరెట్లు తెచ్చేందుకు బయటకు వెళ్లగా, బాషా ఇంటికి వచ్చి రెండు వాటర్ బాటిళ్లు తీసుకుని షెడ్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే మొహిసీన్, అతని స్నేహితులు విచక్షణా రహితంగా కత్తులతో బాషా గొంతుకోయడంతో పాటు ముఖంపై బలంగా పొడిచారు. బాషా కేకలు విన్న భార్య, కుమారుడు సమీర్, అత్త షరీఫా, సోదరుడు మస్తాన్, మరికొందరు షెడ్‌వద్దకు వెళ్లేసరికి దుండగులు పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన బాషా అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.