కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచడానికి ప్రభుత్వం అనుమతించడంతో రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం బస్సులవారీగా పెంచిన చార్జీలను ప్రకటించింది. సామాన్యుడు ఎక్కే పల్లెవెలుగు, ఆర్డినరీ, మొదలుకొని డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల వంటి అన్ని రకాల బస్సుల్లో చార్జీలను పెంచినట్లు సోమవారం ఆర్టీసీ సర్క్యులర్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్త బస్ చార్జీలు నేటి నుంచే అమలులోకి వచ్చేశాయి. టోల్‌ప్లాజా టారిఫ్, ప్యాసింజర్ సెస్, ఎమినిటీస్, ఏసీ సర్వీసులపై జీఎస్టీ తదితర చార్జీలు అదనమని పేర్కొన్నది.సాధారణ ప్రయాణికుల కోసం ఇచ్చే కాంబో టికెట్ల చార్జీలను పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అయితే, ఆర్టీసీ షాకుల పరంపరలో మరో ట్విస్ట్ ఇచ్చింది.
తాజా పెంపుతో ఇప్పటివరకు పల్లెవెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రతి ఐదు కిలోమీటర్ల ప్రాతిపదికన కనీస చార్జీ రూ.6 గా ఉండేది. ఇప్పుడు ఈ కనీసచార్జీని రూ.10 కి పెంచారు. ప్రతి రెండు కిలోమీటర్ల ప్రాతిపదికన సిటీలో కొనసాగుతున్న కనీస చార్జీలను ఆర్డినరీలో రూ.10 కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ కనీసధర (రూ.10)లో మార్పుచేయలేదు. మెట్రో డీలక్స్ కనీసచార్జీ రూ.10 నుంచి రూ.15కు పెరిగింది. పండుగలు, జాతరల సందర్భాల్లో నడిపే ప్రత్యేక సర్వీసులకు సాధారణ చార్జీల కంటే 1.5 రెట్లు వసూలు చేయనున్నారు. ఇదిలాఉండగా, చార్జీల పెంపు విషయంలో ఆర్టీసీ ఓ ట్విస్ట్ ఇచ్చింది. సోమవారం నాడు ప్రయాణం ప్రారంభించి దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి.. టికెట్లు ముందుగా బుక్‌చేసుకున్నవారికి పాతచార్జీలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. గతంలో…ముందుగా టికెట్ తీసుకున్నప్పటికీ…చార్జీల పెంపు అమలులోకి వచ్చిన తర్వాత ప్రయాణిస్తే…ఆ మేరకు ప్రయాణికుడి నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఈ దఫా అలాంటి షాక్ ఇవ్వడం లేదు.