స్క్రీన్‌పై కనిపించేవాళ్లు ఎప్పుడూ ఫిట్‌గానే ఉండాలనే ధోరణిలో ఉంటారు కొందరు నెటిజన్లు. ఏమాత్రం లావైనా ట్రోలింగ్ చేస్తుంటారు. హీరోయిన్స్ విషయంలో ఈ ట్రోలింగ్ మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా హిందీ బిగ్‌బాస్14 విన్నర్, నటి రుబీనా దిలేక్‌కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఆమె ఈ మధ్యకాలంలో బాగా బరువు పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా ఎక్కువైంది.
బరువు పెరగడాన్ని చాలా పెద్ద సమస్యగా చిత్రీకరిస్తే కొందరు తనపై చేస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై రుబీనా స్పందించింది. ‘నా ఫ్యాన్స్, శ్రేయాభిలాషులం అని చెప్పుకునేవారికి నేను బరువు పెరగడం మిమ్మల్ని ఎంతో బాధించిందని నాకు అర్థమవుతుంది. అందుకే అసలు కనికరం లేకుండా ద్వేషాన్ని వెల్లగక్కుతూ నాకు మెసేజ్‌లు, మెయిల్స్ పంపుతున్నారు.
నేను లావుగా ఉండటం, మంచి డిజైనర్ బట్టలు దరించకపోవడం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయకపోవడం మిమ్మల్ని నిరాశ పరిచిందని నాకు తెలుసు. మీకు టాలెంట్ కంటే ఫిజికల్‌గా ఎలా ఉండటం అన్నదే ముఖ్యం. అయితే మీకో శుభవార్త. ఇది నా జీవితం. దాంట్లో ఎన్నో దశలు ఉన్నాయి. అందులో మీరు కూడా ఒకటి. నేను నా అభిమానులను గౌరవిస్తాను. కాబట్టి ప్లీజ్ ఇలాంటి వాళ్లు నా ఫ్యాన్ అని చెప్పుకోకండి’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.