Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ గురించి రోజుకో వార్త ఫిల్మ్ సర్కిల్స్ నుండి బయటకు వస్తుంది. మొదటి షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత ఆ వార్తలు మరి పెరిగి పోయాయి. మొదటి షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత చిరంజీవి దర్శకుడు సురేందర్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నాడని, సురేందర్ రెడ్డిని తప్పించబోతున్నాడు, ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను తీయడంలో ఆయన అనుభవం సరిపోవడం లేదు అంటూ పలు వార్తలు మీడియాలో వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సురేందర్ రెడ్డిని తప్పించడం వల్ల సినిమాపై నెగటివ్ ప్రచారం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన్నే దర్శకుడిగా ఉంచి షాడో దర్శకుడిగా రాఘవేంద్ర రావును దర్శకత్వ పర్యవేక్షణ చేయించాలని భావించారని, కాని ఆయన అందుకు ఒప్పుకోలేదు అంటూ ప్రచారం జరిగింది. తాజాగా గుణశేఖర్ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది.
దర్శకుడు గుణశేఖర్‌కు ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలు తీయడంలో మంచి అనుభవం ఉంది. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమాకు ఆయన్ను వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గుణశేఖర్ ఈ చిత్రం కోసం సెట్టింగ్స్ నిర్వాహణ మరియు సలహాలు సూచనలు ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే గుణశేఖర్ మాత్రం ‘సైరా’ కోసం వర్క్ చేయడం లేదని, ఆయన ప్రస్తుతం తన సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మెగా వర్గాల వారు కూడా ‘సైరా’ చిత్రం కోసం గుణశేఖర్ వర్క్ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చేశారు.