భారత్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌

భారత్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ భారత్‌కు ముడి చమురు విషయంలో భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా గురువారం పుతిన్‌ సర్కార్‌ భారత్‌కు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ముడిచమురుపై మరింత డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యారెల్‌ ధరపై 35 డాలర్ల వరకు డిస్కౌంట్‌ ఇస్తామని చెప్పినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. రష్యా నుంచి భారత్‌ ఆయిల్‌ను దిగుమతులు చేసుకోకూడదని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యాతో వాణిజ్యం భారత్‌కు ప్రమాదమేనన్న సంకేతాలు మొదలయ్యాయి. ఒకవేళ అమెరికా కాదన్నా రష్యా నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేస్తే భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులు చేసుకుంటే భారత్‌కు ‘గ్రేట్‌ రిస్క్’ అంటూ అభివర్ణించింది. ఇప్పటి వరకు చేసిన ఆయిల్‌ దిగుమతులు చాలని, ఇకపై ఎలాంటి దిగుమతులు చేయరాదని హుకుం జారీ చేసింది.

ఓవైపు భారత్‌తో తాము స్నేహంగా ఉంటామని అదే సమయంలో రష్యాకు సపోర్ట్‌ చేస్తే సహించబోమని అమెరికా.. భారత్‌కు సంకేతాలు పంపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం వీలైనంత త్వరగా ముగించేందుకు పుతిన్‌పై ఒత్తిడి తెస్తామని, ఇందుకు భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు.