యుద్ధనౌకకు భారీ నష్టం

యుద్ధనౌకకు భారీ నష్టం

రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక మాస్కోవాను మిసైళ్లతో పేల్చామని ఉక్రెయిన్‌ అధికారులు గురువారం ప్రకటించారు. తమ క్షిపణుల ధాటికి నౌక మునిగిపోయిందని ఒక అధికారి చెప్పారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. ప్రమాదం పెద్దదే కానీ నౌక మునిగిపోలేదని, దాన్ని దగ్గరలోని నౌకాశ్రయానికి చేర్చామని వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు నౌకలో 500మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. నౌకకున్న మిసైల్‌ లాంచర్లు సురక్షితమేనని పేర్కొంది.

మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లను మోసుకుపోతుంది. నౌకలో ఆయుధాలు పేలడంతో నిప్పంటుకుందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం నుంచి ఈ నౌక బయటకు రావడం రష్యాకు ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. నష్టం ఎంతటిదైనా ఈ ఘటన రష్యా ప్రతిష్టకు మచ్చగా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌ తేలికపాటి హెలికాప్టర్లను తమ సరిహద్దుల్లోకి పంపి నివాస భవనాలపై బాంబులు కురిపిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ దాడుల్లో 7గురు గాయపడ్డారని తెలిపింది. సరిహద్దు వద్ద శరణార్థులు దాటుతుండగా ఉక్రెయిన్‌ కాల్పులు జరిపిందని అంతకుముందు రష్యా సెక్యూరిటీ సర్వీస్‌ ఆరోపించింది.