అంతరిక్షంలో వ్యామోగాముల నివాసమైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు భారీ ప్రమాదం తప్పింది. రష్యా కొత్తగా పంపిన రష్యన్ రీసెర్చ్ “నౌకా మాడ్యూల్” అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డాక్ చేసిన కొన్ని గంటల తర్వాత అనుకోకుండా మండటంతో కొద్దిసేపు ఐఎస్ఎస్ పై నియంత్రణ కోల్పోయినట్లు నాసా అధికారులు తెలిపారు. ఇలా మండటం వల్ల అది కక్ష్య నుంచి 45 నిమిషాలపాటు కొద్దికొద్దిగా చలించింది. ఈ సంఘటన వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం లేదని నాసా, రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ ఆర్ఐఎ తెలిపింది.
నాసా బోయింగ్ కొత్త సీఎస్ టి-100 స్టార్ లైనర్ క్యాప్సూల్ నేడు ఐఎస్ఎస్ తో కనెక్ట్ కావాల్సి ఉండేది. కానీ, ఈ సమస్య వల్ల ఆ ప్రయోగాన్ని ఆగస్టు 3 వరకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. 25 టన్నుల “నౌకా” అనే కొత్త మాడ్యూల్ ను రష్యా కజకిస్తాన్ లోని బైకనూర్ నుంచి లాంచ్ చేసింది. అది నిన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానితో అనుసంధానం అయ్యే సమయంలో అందులో స్వయం చాలక వ్యవస్థ పనిచేయక పోవడంతో రష్యాకు చెందిన ఒలేగ్ నోవిట్స్కీ వ్యోమగామి ఆ ప్రక్రియను మాన్యూవల్ గా చేపట్టారు.
మొత్తం ఈ ప్రక్రియ పూర్తయిన 3 గంటల తర్వాత నౌకా మాడ్యూల్ జెట్ థ్రస్టర్లు ఒక్కసారిగా మండటంతో అది అదుపు తప్పింది. కొద్ది సేపటి వరకు భూమితో ఐఎస్ఎస్ కు సంబంధాలు తెగిపోయాయి. అప్పటికే ఐఎస్ఎస్ భ్రమణం సెకనుకు అర డిగ్రీ చొప్పున మారింది. అలాగే, మరో 12 నిమిషాలు కనుక జరిగి ఉంటే పూర్తి వ్యతిరేక దిశలో వచ్చేది అని శాస్త్రవేత్తలు చెప్పారు.
అయితే, కక్ష్యలో ఉన్న ప్లాట్ ఫామ్ లోని మరో మాడ్యూల్ థ్రస్టర్లను యాక్టివేట్ చేయడం ద్వారా నాసా బృందాలు స్పేస్ స్టేషన్ ఓరియెంటేషన్ ను పునరుద్ధరించగలిగినట్లు అధికారులు తెలిపారు. అంతరిక్ష కేంద్రంపై నియంత్రణను తిరిగి పొందడానికి రెండు మాడ్యూల్స్ మధ్య జరిగిన పోరాటాన్ని “టగ్ ఆఫ్ వార్”గా నాసా అభివర్ణించింది.
అంతరాయం సమయంలో సిబ్బందితో కమ్యూనికేషన్ రెండుసార్లు అనేక నిమిషాలపాటు కోల్పోయినట్లు, “సిబ్బందికి ఏ సమయంలోనూ ప్రమాదం జరగలేదు” అని మోంటాల్బానో తెలిపారు. వ్యోమగాములకు అక్కడి నుంచి రక్షించాల్సిన అవసరం వచ్చి ఉంటే, ఐఎస్ఎస్ అవుట్ పోస్ట్ వద్ద ఉన్న స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సూల్ ను “లైఫ్ బోట్”గా రూపొందించినట్లు నాసా వాణిజ్య సిబ్బంది కార్యక్రమం మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు