ప్రాంక్‌స్టార్‌ కు జైలు శిక్ష

ప్రాంక్‌స్టార్‌ కు జైలు శిక్ష

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడంతో సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగింది. ఈ సమయంలో ఫోన్‌ వినియోగదారులకు వినోదం అందించేందుకు తమకు తోచినట్టు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ప్రాంక్‌  వీడియోలు ఒక ఆదాయ పెట్టుబడిగా మారాయి. చిత్రవిచిత్ర ప్రాంక్‌ వీడియోలు తీసి నెటిజన్ల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కరోనా బాధితుడి మాదిరి దగ్గుతూ.. తుమ్ముతూ ఒక్కసారిగా రైలులో కింద పడిపోయాడు.

ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ముందే కరోనా భయంతో వణుకుతుంటే ఆ యువకుడు దగ్గుతూ.. తూలుతూ పడిపోవడంతో భయాందోళనకు గురయిన ప్రయాణికులు రైలును ఆపేసి పరుగులు పెట్టారు. కొద్దిసేపటికి ఆ యువకుడు లేచి ‘ఇది ప్రాంక్‌ వీడియో.. ప్రాంక్‌ వీడియో’ అనడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సీక్రెట్‌ కెమెరాలో రికార్డవడంతో పరిశీలించిన అధికారులు అతడిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అతడికి రెండేళ్లు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన రష్యాలోని మాస్కోలో జరిగింది.

మాస్కోలో మెట్రో రైలును ప్రాంక్‌స్టార్‌గా గుర్తింపు పొందిన కరమతుల్లో డిహబోరోవ్‌ ఎక్కాడు. రైలు మొదలైన కొద్దిసేపటికి ఓ బోగిలోకి వెళ్లి పై విధంగా చేశాడు. 2020 ఫిబ్రవరిలో ఈ ఘటన చేయగా జనాలను భయబ్రాంతులకు గురి చేయడంపై ఆ దేశ పోలీసులు డిహబోరోవ్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై కోర్టు తీర్పు ఇచ్చింది. డిహబోరోవ్‌కు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిద్దరికీ న్యాయస్థానం శిక్ష విధించింది.