ఫేస్ బుక్ కు ర‌ష్యా తీవ్ర హెచ్చ‌రిక‌

russian-telecom-president-serious-warning-to-facebook

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ వంటి సామాజిక మాధ్య‌మాలు వ‌చ్చిన త‌రువాత ప్ర‌జ‌ల జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. ప్ర‌పంచ‌మే గుప్పిట్లోకి వ‌చ్చిన అనుభూతి సొంత‌మ‌యింది. సామాజిక మాధ్య‌మాలు మ‌నుషులంద‌రినీ ఓ ద‌గ్గ‌రకు చేరుస్తున్నాయి. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే. మ‌రోవైపు వ్య‌వ‌స్థాప‌క దేశాల‌నే కేంద్రంగా చేసుకుని ప‌నిచేస్తున్న ఈ సోష‌ల్ మీడియా సంస్థ‌లు ప్ర‌పంచ‌దేశాల‌కు చెందిన పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని వారి ప్ర‌మేయం లేకుండా త‌మ ద‌గ్గ‌ర నిక్షిప్తం చేసుకుంటున్నాయనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రుగుతున్న ఈ ప‌ని వ‌ల్ల ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హక్క‌యిన వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం వాటిల్లుతోంద‌నే వాద‌నా వినిపిస్తోంది.

మ‌న‌దేశంలో ఆధార్ విష‌యంలో ఈ గొడ‌వ జ‌రుగుతున్న‌ట్టుగా ర‌ష్యాలో ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ మీడియా వెబ్ సైట్ల తీరుపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌తీయుల ఆధార్ స‌మాచారాన్ని అమెరికా చేజిక్కించుకుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ట్టుగానే…ర‌ష్యా లో ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ వంటి సంస్థ‌లు వినియోగ‌దారుల స‌మాచారాన్ని నిక్షిప్తంచేసుకుంటున్నాయ‌ని అక్క‌డి టెలికాం సంస్థ‌లు ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా టెలికాం సంస్థ అధిప‌తి అలెగ్జాండ‌ర్ ఝ‌రోవ్ ఫేస్ బుక్ కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీచేశారు. త‌మ చ‌ట్టాల‌ను అతిక్ర‌మిస్తే….2018లో ఫేస్ బుక్ పై నిషేధం విధిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. విదేశీ మెసేజింగ్ స‌ర్వీసులు, సెర్చ్ ఇంజ‌న్లు, సామాజిక మాద్య‌మాల వెబ్ సైట్లు… ర‌ష్య‌న్ ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని నిక్షిప్తం చేయ‌డానికి పాటించాల్సిన విధివిధానాలు పేర్కొంటూ 2014లో ర‌ష్యా ఓ ప్ర‌త్యేక చ‌ట్టం రూపొందించింది. దీని ప్ర‌కారం ర‌ష్య‌న్ల స‌మాచారానికి సంబంధించిన స‌ర్వ‌ర్ల‌ను ర‌ష్యాలోనే నిక్షిప్తం చేయాలి. అయితే ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ వంటి సంస్థ‌లు ఆ నిబంధ‌న పాటించడం లేద‌ని టెలికాం సంస్థ‌లు ఆరోపిస్తున్నాయి. ఫేస్ బుక్ దీనిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే వ‌చ్చే ఏడాది నుంచి త‌మ దేశంలో ఆ సైట్ ను నిషేధిస్తామ‌ని రష్యా హెచ్చ‌రించింది. త‌మ చ‌ట్టాల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌డం లేద‌ని ఇప్ప‌టికే ర‌ష్యా లింక్డిన్ ను నిషేధించింది.