Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- తిరిగి తెరుచుకున్న రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్
- ఒక్కో క్లాసు నుంచి నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రద్యుమ్న హత్య తరువాత..రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ సోమవారం తిరిగి తెరుచుకుంది. అయితే ప్రద్యుమ్న చదివే సెకండ్ క్లాస్ విద్యార్థులు కేవలం నలుగురు మాత్రమే స్కూల్ కు వచ్చారు. వారిలో ఇద్దరు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఒక్క సెకండ్ క్లాసే కాదు.. మిగిలిన క్లాసుల విద్యార్థులు కూడా నలుగురైదుగురు మాత్రమే స్కూల్ కు వచ్చారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో పాఠశాలపై నెలకొన్న భయానికి ఇది నిదర్శనం. . ప్రద్యుమ్న క్లాస్ మేట్స్ తో పాటు..అక్కడ చదువుతున్న అనేకమంది పిల్లలు రేయాన్ స్కూల్‌కు వెళ్లబోమని తెగేసి చెప్తున్నారు. కొందరు పిల్లలైతే స్కూల్ వైపు వచ్చేందుకే భయపడుతున్నారు. అయితే పాఠశాలకు వచ్చిన ఆ నలుగురు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా విచిత్ర అనుభవం ఎదురయింది.
స్కూల్ యాజమాన్యం, అక్కడ పనిచేసేస టీచర్ల వైఖరి చూసి విద్యార్థుల తల్లిదండ్రులు విస్తుపోయారు. పదిరోజుల తర్వాత స్కూల్ తెరిచిన యాజమాన్యం..విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయటం లేదు. ఉపాధ్యాయులైతే పిల్లలను మరో స్కూల్లో చేర్పించుకోమని సలహాలు ఇస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలను వారి నివాస ప్రాంతాల నుంచి స్కూలుకు తీసుకువచ్చే స్కూల్ బస్సు కూడా నడవడం లేదు. బస్ కోసం చాలా సేప ఎదురుచూసి రాకపోవడంతో తానే తన కొడుకుని స్కూల్ కు తీసుకొచ్చానని ఓ విద్యార్థి తండ్రి చెబుతున్నాడు. రేపటినుంచైనా స్కూల్ బస్సు వస్తుందా అని అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వటం లేదని ఆయన అన్నారు. ప్రద్యుమ్న హత్య నేపథ్యంలో విద్యార్థుల రక్షణ కోసం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారని పేరెంట్స్ అడిగితే ..సరైన సమాధానం చెప్పకుండా స్కూల్ యాజమాన్యం మరో 15 రోజులు ఆగమంటోంది. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రద్యుమ్న హత్య కేసులో రేయాన్ యాజమాన్యానికి సీబీఎస్ ఈ షోకాజ్ నోటీసులుజారీచేసింది.