తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో డీలా పడ్డ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరి గట్టి షాక్ ఇచ్చారు. ఆ షాక్ నుంచి తెరుక్కున్నారో లేదో గాని ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు సమాచారం. మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని, ఏ కారణం వల్ల అయినా ఆ చాన్స్ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి టీఆర్ఎస్ నుండి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం టికెట్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌కు సీటు ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని కార్తీక్‌రెడ్డి ఆశించినా పొత్తులో భాగంగా హస్తం పార్టీ ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో అది సాధ్యపడలేదు. చెవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డికే అవకాశం దక్కుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సబితారెడ్డి టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా దాదాపుగా తెరాసలో చేరడం ఖాయమైందని అంటున్నారు. తన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుగా టీఆర్ఎస్లో చేరితే ఎలా ఉంటుందని సుధీర్‌రెడ్డి తన సన్నిహిత నేతలు, కార్యకర్తలతో ఇప్పటికే సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీఆర్ఎస్లో చేరతామని కొన్ని రోజుల కిందటే వర్తమానం పంపినట్లు సమాచారం. పోదెం వీరయ్య, కాంతారావు, ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే కావడంతో ఎటూ చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.