లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్నందుకున్నప్పటికీ.. కెప్టెన్ కోహ్లి వైఫల్యాల పరంపర మాత్రం అభిమానులను కలవరపెడుతోంది. గత రెండేళ్లుగా కోహ్లి తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోతున్నాడు. అడపాదడపా హాఫ్ సెంచరీలు బాదినా.. ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. కనీసం ఇంగ్లండ్ పర్యటనలోనైనా ఆ ముచ్చట తీరుస్తాడని అభిమానులు ఆశించినా.. ఆ అంచనాలన్నిటినీ తలకిందులు చేశాడు. ఇప్పటికే ముగిసిన రెండు టెస్ట్‌ల్లో కేవలం 62 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి వరుస వైఫల్యాలపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు.
అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ లోపాలను ఆయన విశ్లేషించాడు.కోహ్లి మంచి ఆరంభం అందకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని, ఆ ఆందోళన అతని ఫుట్‌వర్క్‌పై ప్రభావం చూపుతుందని, ఆ కారణంగానే కోహ్లి వరుసగా విఫలమవుతున్నాడని మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఒత్తిడిలో పాదాలు కదపలేకపోవడంతో పాటు స్టంప్స్‌ను దాటి మరీ దూరంగా వెళ్తున్నాడని, ఈ క్రమంలో సులువగా వికెట్‌ను సమర్పించుకుంటున్నాడని పేర్కొన్నాడు. తన ఇన్నింగ్స్‌కు శుభారంభం దక్కడం లేదని కోహ్లి ఒత్తిడిని లోనవుతున్నాడని, అతని ఆలోచనా విధానమే సమస్యలకు దారి తీస్తుందని తెలిపాడు. ఫుట్ వర్క్ సమస్యకు పరిష్కారం త్వరగా లభిస్తుందని, అదే ఒత్తిడిని అధిగమించాలంటే చాలా సమయం పడుతుందని, ఈ మధ్యలో కెరీర్ ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సచిన్ విశ్లేషించాడు.
ఓ ప్రముఖ వార్తా సంస్థకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.మరోవైపు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై సచిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్ ఆడే విషయంలో అతను ఎంతో పరణితి సాధించాడని కొనియాడాడు. బంతులను వదిలేయడమే కాకుండా అద్భుతంగా డిఫెన్స్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే, తన ఫేవరెట్ షాట్ అయిన పుల్ షాట్ ఆడే క్రమంలో రోహిత్ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించాడు. ఈ షాట్ ఆడే ప్రయత్నంలో అతను ఎక్కువ సార్లు అవుటవుతున్నాడని, ఇంగ్లండ్ బౌలర్లు రోహిత్ ఈ వీక్నెస్పైనే ఫోకస్ చేస్తూ అతన్ని ఔట్ చేస్తున్నారని విశ్లేషించాడు. ఈ విషయం గ్రహించాలని రోహిత్‌కు ఇప్పటికే లక్ష్మణ్, గవాస్కర్‌లు సూచించిన విషయం తెలిసిందే.