మైసూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. డబ్బు చెల్లించలేదని చెబుతూ మృతదేహాన్ని ఇవ్వకుండా ఓ ఆస్పత్రి యాజమాన్యం కర్కశంగా వ్యవహరించింది. మైసూరు ఆలనహళ్లి నివాసి బసవరాజు కరోనా సోకి శ్రీరాంపుర వద్ద ఉన్న గౌతమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. అయితే మృతదేహాన్ని ఇచ్చేందుకు వైద్యులు నిరాకరించారు.
తన తాళిని తాకట్టు పెట్టి మృతుడి భార్య రూ.90 వేలు చెల్లించింది. కానీ రూ.లక్షన్నర చెల్లిస్తేనే కానీ మృతదేహాన్ని ఇవ్వలేమని వైద్యులు తేల్చి చెప్పారు. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు ఆస్పత్రికి వచ్చి మాట్లాడారు. కరోనా కష్ట సమయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించడం సరికాదని, మృతదేహాన్ని ఇవ్వకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన ఆస్పత్రి సిబ్బంది ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించింది.