అందరు హీరోలకు ఆరోగ్య సమస్యలు, సాయి ధరమ్‌ తేజ్‌ కి తప్ప

అందరు హీరోలకు ఆరోగ్య సమస్యలు, సాయి ధరమ్‌ తేజ్‌ కి తప్ప

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో మంచి విజయాలతో సత్తా చాటిన ఈ మెగా హీరో తరువాత కెరీర్‌లో కాస్త తడబడ్డాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురు కావటంతో సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ కాస్త ఇబ్బందుల్లో పడింది. అందుకే ప్రస్తుతం సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ సాయి ధరమ్‌ తేజ్‌.

ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రతీ రోజు పండగే అనే పేరుతో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ పాత్రపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా మారుతి సినిమాల్లో హీరోలకు ఏదో ఒక ఆరోగ్యపరమైన సమస్య ఉంటుంది. ఆ సమస్య నుంచే కామెడీ జనరేట్‌ చేస్తుంటాడు మారుతి. ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాలో నాని మతిమరపుతో ఇబ్బంది పడుతుంటాడు. బాబు బంగారం సినిమాలో వెంకటేష్‌ అతి మంచితనంతో ఇబ్బంది పడుతుంటాడు. మహానుభావుడు సినిమాలో శర్వానంద్‌ ఓసీడీతో ఇబ్బంది పడుతుంటాడు.

ఇలా తన సినిమాల్లో ఒక్కో హీరోకు ఒక్కో రోగాన్ని అంటగట్టేసిన మారుతి, ప్రతి రోజు పండగే సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌కు ఏ రోగం ఉన్నట్టుగా చూపిస్తున్నాడన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలపై సాయి ధరమ్‌ తేజ్‌ స్పందించాడు. ఈ సినిమాతో తనకు ఎలాంటి రోగం లేదని. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని క్లారిటీ ఇచ్చాడు.

అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్‌, రావూ రమేష్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తుండగా విజయ్‌ భాస్కర్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.