అలాంటి సన్నివేశాలు నాకు అసౌకర్యంగా ఉంటాయి

అలాంటి సన్నివేశాలు నాకు అసౌకర్యంగా ఉంటాయి

మీ టూ’ అంటూ నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎప్పట నుంచి అయితే బయటకు చెబుతున్నారో అప్పటి నుంచి ఓ మంచి మార్పు వచ్చిందనే చెప్పాలి. అందుకు ఓ ఉదాహరణ సాయి పల్లవి చెప్పిన ఒక విషయం. ఇటీవల ఓ సందర్భంలో ‘మీ టూ’ ఉద్యమం గురించి సాయి పల్లవి మాట్లాడుతూ– ‘‘కథలో భాగంగా హీరోతో పెదవి ముద్దు సన్నివేశంలో నటించాలని ఒక దర్శకుడు అడిగారు. అలాంటి సన్నివేశాలు చేయడం నాకు అసౌకర్యంగా ఉంటుందన్నాను. ఇంతలో, హీరో కలగజేసుకొని ‘మీరు బలవంతపెడితే ‘మీ టూ’ ఉద్యమంలో ఇరుక్కునే ప్రమాదం ఉంద’ని దర్శకుడితో అన్నారు.

దాంతో లిప్‌ లాక్‌ సీన్‌ని ఆ దర్శకుడు విరమించుకున్నారు. ‘మీ టూ’ వల్ల నేను ఆ సీన్‌ నుంచి తప్పించుకున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే అది ఏ సినిమా? హీరో ఎవరు? లిప్‌ లాక్‌ చేయమన్న దర్శకుడు ఎవరు? అనే విషయాలను మాత్రం సాయి పల్లవి బయటపెట్టలేదు. ఇక శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించిన ‘లవ్‌స్టోరీ’లో ముద్దు సీన్‌ ఉంది. ట్రైన్‌ లో చైతూతో ట్రావెల్‌ చేస్తున్న సీన్లో సాయి పల్లవి, చైతూకి ముద్దుపెడతారు. అయితే ఇది లిప్‌ లాక్‌ కాదు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రానాతో ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నారామె. మరోవైపు వెబ్‌ సిరీసుల్లోనూ నటిస్తున్నారు.