తన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సాయి పల్లవి.. చిరంజీవితో తెరపంచుకునే ఛాన్స్ వదులుకున్న విషయమై క్లారిటీ ఇచ్చింది. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘భోళా శంకర్’లో చిరు చెల్లెలిగా నటించే అవకాశాన్ని వదులుకుంది సాయి పల్లవి. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కు రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. సాయి పల్లవి వదులుకున్న ఛాన్స్ కీర్తి సురేష్ చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఎందుకు వదులుకుందో చెబుతూ ఓపెన్ అయింది సాయి పల్లవి.
రీమేక్ చిత్రాలకు తాను వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి.. ఏదైనా సినిమా ఓ భాషలో హిట్ అయితే అదే సినిమాను రీమేక్ ద్వారా ఇతర బాషా ప్రేక్షకులకు చేరువ చేస్తుంటారు. అయితే అప్పటికే ఒకరు చేసిన పాత్రను రీమేక్ చేయడంలో చాలా ఒత్తిడి ఉంటుంది. వేరే వాళ్ళు చేసిన పాత్ర కంటే బెటర్‌గా చేయాలని చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఫ్రెష్ రోల్ చేస్తే నా ఇంపాక్ట్ ఉంటుందనే ఫీలింగ్ నాది. అందుకే నేను రీమేక్ రోల్స్ ఇష్టపడను. చిరంజీవి సినిమా ఆఫర్ రిజెక్ట్ చేయడం వెనుక రీజన్ ఇదొక్కటే అని సాయి పల్లవి చెప్పింది.
ఇకపోతే ”ఫిదా, లవ్‌స్టోరీ” సినిమా షూటింగ్స్ ఎక్కువ భాగం పల్లెటూరిలోనే జరిగాయని చెప్పిన ఆమె, విలేజ్ ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరచిపోలేనని తెలిపింది. ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. అమ్మానాన్న ఏం చేస్తారు?’ ఇలా వ్యక్తిగత విషయాలు అడిగేవారని సాయి పల్లవి తెలిపింది. లవ్ స్టోరీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే.. వారు పండించిన పసుపును బహుమానంగా ఇచ్చారని చెప్పింది.
ఫీల్ గుడ్ ‘లవ్ స్టోరీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.