టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం రీ రికార్డింగ్‌ను కేరళలో మారుతి చేయిస్తున్నాడు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం నేడు మారుతి హైదరాబాద్ వచ్చేయాల్సి ఉంది. కాని భారీగా కేరళలో వర్షాలు పడుతున్న కారణంగా మారుతి మరో రెండు లేదా మూడు రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో ఆడియో వేడుక కూడా క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. మారుతి ప్రస్తుతం రీ రికార్డింగ్ కోసం చాలా కష్టపడుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాతావరణం అనుకూలించకున్నా కూడా సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా మారుతి చెప్పుకొచ్చాడు.
ఈనెల 18న ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించాలని భావించారు. అయితే మారుతి కేరళలో చిక్కుకు పోయిన కారణంగా ఆడియో విడుదల కార్యక్రమంను క్యాన్సిల్ చేశారు. మారుతిని క్షేమంగా తీసుకు వచ్చేందుకు ఇప్పటికే ఒక టీం కేరళ బయలుజేరినట్లుగా సమాచారం అందుతుంది. విమాన రాక పోకలు నిలిచి పోయిన కారణంగా మారుతి మరో రెండు రోజులు అక్కడ ఉండాల్సి ఉంటుందనే సమాచారం అందుతుంది. అప్పటికి కూడా రాలేని పరిస్థితి ఉంటే అప్పుడు రోడ్డు ప్రయాణం ద్వారా మారుతిని తీసుకు వచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీవర్గాల ద్వారా సమాచారం అందుతుంది. నాగచైతన్య, అను ఎమాన్యూల్ జంటగా తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రం భారీ అంచనాలను కలిగి ఉంది. ఆగస్టు 31న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.